తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థల తీరు కంటే లీకుల పైనే కేటీఆర్, హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణ గదిలో ఏం జరుగుతుందో బయటకు తెలియకముందే, కొన్ని మీడియా సంస్థల్లో తమకు వ్యతిరేకంగా కథనాలు రావడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని వారు ఆరోపిస్తున్నారు.
దర్యాప్తు సంస్థలు అధికారికంగా ఎటువంటి ప్రెస్ నోట్స్ విడుదల చేయకముందే నేతలు విచారణలో తడబడ్డారు, నేరాన్ని ఒప్పుకున్నారు ” వంటి వార్తలు రావడం ఒక రకమైన మీడియా ట్రయల్ అని కేటీఆర్ అంటున్నారు. విచారణ అనేది చట్టబద్ధమైన ప్రక్రియ అని, కానీ దానిని ఒక రాజకీయ టీవీ సీరియల్ లాగా మార్చి ప్రజల్లో తమపై ఉన్న గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని హరీష్ రావు కూడా మండిపడ్డారు. ఈ లీకుల ద్వారా విచారణ ప్రారంభం కాకముందే నేరస్తులుగా చిత్రీకరించడం మంచిది కాదంటున్నారు.
శుక్రవారం విచారణ అనంతరం కేటీఆర్ తన విచారణకు సంబంధించిన లీకులను ఎవరు ఇస్తున్నారో చెప్పాలని సిట్ అధికారులను నేరుగా ప్రశ్నించినట్లు వెల్లడించారు. అధికారులు కేవలం తమ విధిని నిర్వహిస్తున్నారా లేక రాజకీయ యజమానుల ప్రయోజనం కోసం లీకులు ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దర్యాప్తులో గోప్యత లోపించిందని, కేవలం బీఆర్ఎస్ నేతలను మానసిక వేధించేందుకే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుందని ఆయన ఆరోపించారు.
ఈ లీకులపై అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ తన పార్టీ నేతలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, దీనిని ఎవరూ నమ్మవద్దని కోరారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతామని స్పష్టం చేస్తున్నారు.
