కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కీ గౌడ్… కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించి బయటపెట్టిన విషయాలను లోతుగా పరిశీలిస్తే.. సంచలం సృష్టించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కేటీఆర్ వివిధ వర్గాల కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో కమిషన్లు తీసుకుని దాన్ని విదేశాలకు తరలించి.. మళ్లీ పెట్టుబడుల రూపంలో.. వాటిని హైదరాబాద్‌కు తీసుకు వచ్చారని.. మధుయాష్కీ స్పష్టంగా ప్రకటించారు. కాల్ హెల్త్, సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ అనే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని.. మధుయాష్కీ చెబుతున్నారు. ఈ ఆస్తులన్నీ.. కల్వకుంట్ల అజయ్ రావు అన్న పేరుతో ఉన్నట్లుగా..యాష్కీ చెబుతున్నారు. కేటీఆర్ అసలు పేరు అదే అంటున్నారు.
కాల్ హెల్త్ అనే కంపెనీ.. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన స్టార్టప్. ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలు అందించే స్టార్టప్. దీని వ్యవస్థాపకరాలు… తేజారాజు భార్య. ఈ తేజా రాజు.. సత్యం రామలింగరాజు కుమారుడు. ఈయన కేటీఆర్‌కు మంచి మిత్రుడు. కేటీఆర్ ఆంధ్రుల ప్రస్తావన వచ్చినప్పడల్లా.. భీమవరం రాజులతో తనకు ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయని.. గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు..మధుయాష్కీచెప్పిన దాన్ని బట్టి చూస్తే.. సత్యం రామలింగరాజు బంధువులతోనే ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సత్యం కంప్యూటర్స్ పతనంలో.. రామలింగరాజు పాత్ర కన్నా… అనధికారికంగా తేజారాజు పాత్రే ఎక్కువని చెబుతూంటారు. సత్యం కంపెనీ పేరును తిరగేసి.. మైటాస్ పేరుతో.. ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారు. వైఎస్ హయాంలో… దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుని… ఇబ్బడిమబ్బడిగా భూములు కొని… అసలు మాతృ కంపెనీనే బోర్లా పడిపోయేలా చేశారని అంటారు. సత్యం దెబ్బతో… అటు రామలింగరాజు కానీ.. ఆయన కుమారుడు కానీ.. వ్యాపారాలు చేయకుండా.. సెబి నిషేధం విధించింది.
అయితే.. తేజా రాజు భార్య సంధ్యా రాజు 2014 అక్టోబర్‌లో కొత్తగా వ్యాపారం ప్రారంభించారు. కాల్ హెల్త్ స్టార్టప్ ను ప్రారంభించారు. దీన్ని ప్రారంభించి చాలా రోజులవుతున్నప్పటికీ… భారీగా ఆదరణ పొందుతున్న దాఖలాల్లేవు. అయితే కార్యకలాపాలు మాత్రం ఉన్నాయి. ఎంత మేర లావాదేవీలు జరుగుతున్నాయి…ఎంత వ్యాపారం నడుస్తోంది.. ఏఏ నగరాల్లో సర్వీసులు అందిస్తున్నారనేదానిపై.. వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. పెట్టుబడులు మత్రం.. భారీగా వచ్చి పడుతున్నాయి. ఈ ఏడాది మొదటి నాటికి 14.1 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా వచ్చినట్లు ఆన్ లైన్ ఫండింగ్ వెబ్ సైట్స్ రిపోర్ట్ చేశారు. ఎవరు పెట్టారన్నది.. గోప్యంగా ఉంచారు. పుంజుకోని ఓ స్టార్టప్‌కి ఇంత మొత్తం పెట్టుబడులు రావడం ఆశ్చర్యకరమేననేది.. ఇండస్ట్రీ వర్గాల అంచనా. మొత్తానికి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వస్తే… కేటీఆర్ ఇబ్బందుల్లో పడొచ్చనే అంచనాలున్నాయి.