లౌక్యం తెలియని లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన సుపుత్రుడు నారా లోకేశ్ కి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను పూర్తిగా అప్పజెప్పి పప్పులో కాలేశారా ? రాజకీయ లౌక్యం అంతగా తెలియని లోకేశ్ మాట పార్టీ నాయకులు వినే పరిస్థితి ఉన్నదా ?

తాజా పరిస్థితులు చూస్తుంటే ఇవన్నీ కేవలం అనుమానాలేనని కొట్టిపారేయలేం. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు తన శక్తుయుక్తులు ధారబోసి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకువచ్చారు. అధికారం చేజిక్కడంతో ఏపీలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకున్నమాట వాస్తవమే. ఒకప్పుడు తెలుగుదేశం జెండా ఎగరని గ్రామాల్లో ఇప్పుడు పచ్చజెండాలు రెపరెపలాడుతున్నాయి. వైఎస్సార్ ఫోటోలకు బదులుగా చంద్రబాబు ఫోటోలు కనిపించే స్థితి చాలా గ్రామాల్లో వచ్చింది. అధికార పార్టీలో ఉంటే ఎంతోకొంత లాభం పొందవచ్చన్న ప్రాధమిక సూత్రమే ఇందుకు కారణం కావచ్చు. లేదా, నవ్యంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడంపట్ల చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం కూడా కావచ్చు. రాజకీయ వాతావరణం నెమ్మదిగా మారుతోంది. అప్పటివరకు ఇతర పార్టీలను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వలసలు ప్రారంభించారు. దీంతో తెలుగుదేశానికి ఏపీ కంచుకోటగా మారుతోంది.

అయితే ఈ కంచుకోట నిలకడగా అలాగే ఉండిపోతుందా, లేక వచ్చే ఎన్నికలనాటికి అది `డొల్ల కోట’గా మారిపోతుందా? -అన్న సందేహాలు పొడజూపుతున్నాయి. ఇలాంటి భయాలు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నవారిలో కనబడుతుండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం, చంద్రబాబు పార్టీని పట్టించుకోకపోవడమే. ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా తక్కువ సమయం మాత్రమే పార్టీ క్యాడర్ తో గడుపుతున్నారు. ఎక్కువ సమయం ప్రభుత్వ కార్యక్రమాలతోనూ, అధికారుల సమావేశాలతోనూ బిజీబిజీగా ఉంటున్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మీదనే ఆయన ప్రధానంగా దృష్టిసారించారు. ఫలితంగా పార్టీలో ఎవరు ఏంచేస్తున్నారో పట్టించుకునే తీరిక ఆయనకు లేకుండాపోయింది. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నమాట నిజమే. కానీ, ఇందులో ఎంత సమయం పార్టీ పరువు, ప్రతిష్టలకు వెచ్చిస్తున్నారన్నది ముఖ్యం. ఇసుక తవ్వకాల దగ్గర నుంచి కాల్ మనీ వ్యవహారాల దాకా ప్రతి అక్రమ చేష్టల్లో తెలుగుదేశం నాయకులే అడ్డంగా దొరికిపోతున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెబుతున్నా, వారికి పాస్ పుస్తకాలు జారీచేయడంలోనూ ఎమ్మెల్యేలకు వాటాలు అందుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే, ప్రజలు ఆశించిన స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం లేదన్నది పచ్చినిజం. ఈ నేపథ్యంలో లోకేశ్ కి పార్టీ వ్యవహారాలను చంద్రబాబు పూర్తిగా అప్పగించడమే పెద్ద తప్పు.

లోకేశ్ కు రాజకీయ అనుభవం తక్కువన్న సంగతి అందరికీ తెలుసు. అందుకు తగ్గట్టుగానే ఆయన కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే సీనియర్లను సలహా అడిగే పరిస్థితే ఉంది. దీంతో పార్టీలోని సీనియర్ నాయకుల ఎదుట లోకువైపోతున్నారు. అంతేకాదు, నిన్నగాక మొన్న అడుగుపెట్టిన నాయకులు కూడా లోకేశ్ ని పట్టించుకోవడం మానేస్తున్నారని తెలిసింది. పార్టీ సభ్యత్వాల దగ్గర నుంచి అనేక పునుల్లో లోకేశ్ జోక్యం చేసుకుంటున్నప్పటికీ, అదంతా ట్రయినింగ్ లో భాగంగానే భావిస్తున్నారే తప్ప లోకేశ్ చురుగ్గా పనిచేస్తున్నారన్న భావన ఎవ్వరిలోనూ కలగడంలేదు. కొన్ని సందర్భాల్లో లోకేశ్ వ్యవహరణశైలిపై జోకులు వేసుకుంటున్నారు. ఈ మధ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంపై లోకేశ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వంద స్థానాల్లో గెలుస్తుందని అనడం ఎగతాళి పాలైంది. హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో అటు చంద్రబాబుగానీ, ఇటు లోకేశ్ గానీ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంలేదు. పైగా తండ్రీ కొడుకులు ఏపీ నామజపం చేస్తున్నారు. గ్రేటర్ ను పట్టించుకోవడమే మానేశారు. అలాంటప్పుడు గ్రేటర్ లో తెలుగుదేశం హవా నడుస్తుందని చెబితే, తెలంగాణ నాయకులు ఎలా నమ్మగలరు ? రాజకీయంగా తెలిసీతెలియనితనం ఇలాంటి సంఘటనల ద్వారా బహిర్గతమవుతోంది.

రాజకీయంగా ఎంతో ఎదగాల్సిన లోకేశ్ ని ఎవ్వరూ తప్పుపట్టడంలేదు. అయితే, ఇంత లేతవయసులో అంతటి పెద్ద బాధ్యతలు అప్పగించి, తానుమాత్రం ఊర్లు, దేశాలు పట్టుకుని తిరుగుతున్న తండ్రిదే తప్పని అంటారు. పార్టీ శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అధికారంలో ఉండేసరికి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా ఎప్పటికప్పుడు నివేదికలు తయారుచేసి వాటిని చంద్రబాబు దృష్టికి తెచ్చే నెట్ వర్క్ లోపించింది. 2009 ఎన్నికలప్పుడు `క్యాష్ బ్యాక్’ ఫథకాన్ని రూపొందించి చిన్న వయసులోనే మార్కులు కొట్టేసిన లోకేశ్ పట్ల చంద్రబాబు ఆశలు పెంచుకున్నారు. లోకేశ్ రూపకల్పన చేసిన ఈ పథకం తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడకపోయినా, రాహుల్ చొరవతో యుపీఏ సర్కార్ అందిపుచ్చుకుని దాన్ని అమలుచేసింది. లోకేశ్ లో తెలివితేటలు బాగానే ఉన్నాయి. అయితే, రాజకీయంగా ఎదగాలంటే, అంతకు మించి లౌక్యం ఉండాలి. అది ఇంకా అలవాటుకాలేదు. లౌక్యం తెలియని కొడుక్కి పార్టీ పగ్గాలు అప్పగించి చంద్రబాబు పప్పులో కాలేశారు. ఇది చివరకు పార్టీ బలహీనపడటానికి దారితీయవచ్చు.

చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. అధికార పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంటేనే వచ్చే (2019) ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ స్థానాలను తెలుగుదేశం సొంతం చేసుకోగలదు. ఇప్పటికే బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సిపీ ప్రజాభిమానాన్ని పెంచుకుని, బలం పుంజుకోగలిగితే, అప్పుడు టిడిపీ పరిస్థితి ఏమిటి ? సభలు, సమావేశాల్లో మునిగితేలుతున్న చంద్రబాబు ఈ దిశగా ఆలోచిస్తున్నట్లులేదు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close