తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సుమారు 124 మంది మావోయిస్టులు లొంగి పోనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతం కావడం, మార్చి 31 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలకాలన్న కేంద్రం లక్ష్యానికి ఇది అతిపెద్ద ముందడుగుగా కనిపిస్తోంది.
ఈ లొంగిపోయే వారి జాబితాలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయన, జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గణపతి స్వగ్రామమైన జగిత్యాల జిల్లా బీర్పూర్లో కూడా దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయనతో పాటు పీఎల్జీఏ విభాగానికి చెందిన కీలక కమాండర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ గణపతి నిజంగానే లొంగిపోతే, అది దశాబ్దాల మావోయిస్టు ఉద్యమానికి ఒక ముగింపు ఘట్టంగా మారుతుంది. ఇప్పటికే తిప్పరి తిరుపతి , మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనేతలు పోలీసుల చెంతకు చేరగా, ఇప్పుడు గణపతి కూడా అదే బాట పట్టడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది.
