ప్రొ.నాగేశ్వర్ : చంద్రబాబుపై మోడీ చేసిన విమర్శలకు విలువ ఉందా..?

తెలుగుదేశం పార్టీతో కటిఫ్ చెప్పిన తర్వాత మోడీ .. తొలిసారి గుంటూరు వచ్చారు. చంద్రబాబును విమర్శించడానికే సమయం కేటాయించారు. యూటర్న్ దగ్గర్నుచి వెన్నుపోటు వరకూ అనేక అంశాలపై విమర్శలు చేశారు. మరి ఆయనకు ఇవన్నీ ముందు తెలియవా..?. మోడీ చేసిన విమర్శల్లో నిజం ఉంటే.. దానికి బీజేపీ బాధ్యత వహించదా..?

ప్రత్యేకహోదాపై యూటర్న్ తీసుకుంది మోడీనే కదా..!

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుది యూటర్న్ అంటూ.. నరేంద్రమోడీ గుంటూరు సభలో విమర్శించారు. మొదట… యూటర్న్ తీసుకుంది నరేంద్రమోడీనే కదా..!. అసలు ప్రత్యేకహోదా అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ. రాజ్యసభలో వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా కావాలన్నారు. వాళ్లే ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా ఇవ్వలేము ప్యాకేజీ ఇస్తామన్నారు. దానికి చంద్రబాబు అంగీకరించారు. మొదట మోడీ యూటర్న్ తీసుకుంటేనే చంద్రబాబు తీసుకున్నారు. ఇద్దరిదీ తప్పే. ఇప్పుడు గుంటూరు వచ్చి చంద్రబాబుది తప్పు అని విమర్శిస్తే.. ముందుగా.. ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాల్సింది. మోడీ, చంద్రబాబు ఇద్దరూ హోదాపై… వేర్వేరు మాటలు మాట్లాడారు కానీ.. ప్రజలు ఎప్పుడూ హోదా డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు.

ఏపీకి ఎంత ఇచ్చారు.. రూ. 5 లక్షల కోట్లా..? రూ. మూడు లక్షల కోట్లా..?

గుంటూరు సభలో ప్రధానమంత్రి మోడీ ప్రధానంగా.. ఓ మాట చెప్పారు. ఏపీకి రూ. మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. దేనికి ఎంత అన్న వివరణ ఏమీ ఇవ్వలేదు కానీ… కేంద్ర విద్యాసంస్థలు, ఎయిమ్స్ అంటూ కొన్ని ప్రాజెక్టుల వివరాలు చెప్పారు. అదే వారం రోజుల కిందట.. అమిత్ షా.. శ్రీకాకుళం పర్యటనకు వచ్చినప్పుడు.. ఆయన రూ. ఐదు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏపీకి ఇచ్చామని చెప్పారు. వారం తర్వాత వచ్చిన మోడీ.. దాన్ని రూ. 3లక్షల కోట్లకు కుదించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ ఢిల్లీలోనే ఉంటారు. ముందుగా వారిద్దరూ మాట్లాడుకుని.. ఏపీకి ఎంత ఇచ్చామో లెక్కలేసుకుంటే బాగుంటుంది కదా..! కనీసం ఎంత ఇచ్చామన్నదాన్ని చెప్పడానికైనా.. ఇద్దరూ ఒక మాట మీద ఉంటే బాగుంటుంది. వంద ఇచ్చామా..? వెయ్యి ఇచ్చామా..? పదివేలు ఇచ్చామా..? అన్నది కాదు.. ముందుగా అందరూ ఒకే మాట చెప్పాలి కదా..! పలాసలో.. రూ. ఐదు లక్షల కోట్లకుపైగా ఉంటే… గుంటూరుకు వచ్చే సరికి రూ. మూడులక్షల కోట్లు ఎలా అయింది..?.

ఏపీకే అన్ని లక్షల కోట్లు ఇస్తే మిగతా రాష్ట్రాలకేమి ఇచ్చారు..?

ఏపీకే మూడు లక్షల కోట్లు ఇచ్చారనుకుందాం.. మరి దేశానికి ఎంత ఇచ్చి ఉండాలి. ఆ నిష్పత్రి ప్రకారం చూస్తే.. దాదాపు అరవై లక్షల కోట్లు ఇచ్చి ఉండాలి కదా..! అసలు భారత దేశ బడ్జెటే.. రూ. ఇరవై ఐదు లక్షల కోట్లు. నాలుగేళ్ల కిందట.. రూ. ఇరవై లక్షల కోట్లు. రాష్ట్రాలకే ఇరవై లక్షల కోట్లు ఇస్తే.. ఇక బడ్జెట్ ఖర్చులు రూ. ఐదు లక్షలు మాత్రమేనా..?. ఈ నాలుగేళ్లలో .. ఉజ్జాయింపుగా… 70 లక్షలు – 80 లక్షల కోట్ల మధ్య బడ్జెట్ ఉంటుంది. ఈ నాలుగేళ్లలో 75 లక్షల బడ్జెట్ ఉంటే.. ఒక్క ఏపీకే రూ. 3లక్షల కోట్లు ఇచ్చి ఉంటే.. మిగతా 29 రాష్ట్రాలకు ఎంత ఇచ్చి ఉండాలి..?. ఏపీ ప్రభుత్వం నాలుగేళ్ల బడ్జెట్ చూస్తే… ఆరేడు లక్షల కోట్లు ఉంటుంది. అది మొత్తం.. కేంద్రమే ఇచ్చి ఉంటే.. ఏపీకి ఏమీ వనరులు లేనట్లేనా..? ఆర్థిక సంఘం రాజ్యాంగ ప్రకారం పన్నుల్లో వాటాలు ఇస్తుంది. దానితోపాటు.. రహదారి ప్రాజెక్టు వ్యయం.. రూ. పదివేల కోట్లు అయితే.. ఈ ఏడాది ఓ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. కానీ.. కేంద్రం.. ఈ పదివేల కోట్లను ఇచ్చినట్లు లెక్కలు రాసుకుంటోంది. అంటే.. ఏపీ నుంచి వసూలు చేసిన పన్నుల్లోనే వాటా ఇస్తూ.. అదేదో అప్పనంగా ఇవ్వడమే కాదు.. ఇవన్ని నిధుల్ని కూడా ఇచ్చినట్లు చెప్పుకుని.. లెక్కలు చెబుతోంది.

కేంద్రానికి సొమ్మెక్కడిది..? లెక్కలడగడానికి మోడీకి హక్కు ఎక్కడుంది..?

అదే సమయంలో మోడీ.. ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పిస్తామంటూ.. చెప్పుకొచ్చారు. ఏపీ నుంచి వెళ్లే ఆదాయపు పన్ను మొత్తం కేంద్రానికే పోతుంది. ఏపీలో కేంద్ర పన్నులు మొత్తం కేంద్రానికి వెళ్తాయి. ఏపీలో ఎవరు ఏ వస్తువు కొన్నా సీజీఎస్టీ మొత్తం కేంద్రానికి వెళ్తాయి. అవే తిరిగి ఇస్తారు. అంటే.. రాష్ట్రాల నుంచే.. కేంద్రానికి నిధులు వెళ్తాయి. కేంద్రం అనేదానికి ప్రత్యేకంగా అస్థిత్వం లేదు. రాష్ట్రాలన్నీ కలిస్తే.. కేంద్రం. కేంద్రానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. అందుకే కేంద్రం మిధ్య అన్నారు. రాష్ట్రాలులేకుండా కేంద్రం ఉండదు. అందుకే… మేమిచ్చే నిధులకు… లెక్కలు చెప్పాలనడం కరెక్ట్ కాదు. మోడీ చక్రవర్తి కాదు.. చంద్రబాబు సామంత రాజు కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నారు. రాష్ట్రం చేసే ఖర్చుల వివరాలు అసెంబ్లీకి చెబుతారు. కేంద్రం చేసే ఖర్చుల వివరాలు పార్లమెంట్ కు చెబుతారు. ఇలా లెక్కలు చెప్పాలని అడగడం… ఏపీని అవమానించడమే. రాష్ట్రాల వ్యవస్థలు రాష్ట్రాలకు ఉన్నాయి. వాటికి సీఎం బాధ్యునిగా ఉంటారు. లెక్కలు అడగడానికి మోడీ ఎవరు..? ప్రధానికి ఆ హక్కు ఎక్కడిది..? దేశం ఏమీ ఆయన జాగీర్ కాదు కదా..!

చంద్రబాబు అవినీతిలో నాలుగేళ్లుగా బీజేపీ వాటా ఎంత..?

చంద్రబాబునాయుడు తప్పు చేస్తే.. కచ్చితంగా విచారించాల్సిందే. నాలుగేళ్లపాటు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ల ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. తప్పు చేస్తే.. శిక్షించాలి. భారత ప్రజాస్వామ్యం ప్రకారం.. నిర్ణయాలకు కేబినెట్ సమిష్టి బాధ్యత వహిస్తుంది. మరి మాణిక్యాలరావు, కామినేని.. దీనిపై ఎప్పుడూ ఎందుకు మాట్లాడలేదు. ఇదేమీ.. మోడీ, బాబు.. మధ్య వివాదం కాదు. దానికి ప్రజల్ని శిక్షించడం కరెక్ట్ కాదు. వెనుకబడిన జిల్లాల నిధులు ఆపేయడం కచ్చితంగా ప్రజల్ని శిక్షించడమే. ఏమైన తప్పులు జరిగితే.. రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. వాటితో ముందుకెళ్లాలి. అమరావతి, పోలవరంలలో అవినీతి జరుగుతూంటే.. కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు ఏం చేశారు..?

పొత్తు పెట్టుకున్నప్పుడు వెన్నుపోట్లు తెలియవా..?

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారంటూ.. నరేంద్రమోడీ తెగ చెలరేగిపోయారు. కానీ.. ఆయన పొత్తులు పెట్టుకున్నప్పుడు.. ఈ విషయం తెలియదా..?. ఇప్పుడే గుర్తు వచ్చిందా..? అయినా ఎన్టీఆర్ ఉన్నప్పుడే… ఆయన ప్రజల్లోకి వెళ్లినా.. పార్టీ విషయంలో.. చంద్రబాబుకే అప్పట్లో ప్రజలు అండగా నిలిచారు. రెండో సారి కూడా గెలిచారు కదా..! ఇవన్నీ ఇప్పుడెందుకు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com