ముఖ్యమంత్రి జయలలిత మరణం దగ్గర నుంచీ తమిళనాడు రాజకీయాల్లో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా చేసుకుని, తమిళనాడును తమ అదుపులోనికి తెచ్చే ప్రయత్నాలను భాజపా మొదలుపెట్టిందనే విమర్శలు మొదట్నుంచీ ఉన్నాయి. సరిగ్గా అమ్మ మరణించిన సమయంలోనే కేంద్రం నుంచి దూతగా అప్పట్లో ఓ ప్రముఖ నేత వెళ్లారనీ, అక్కడ చక్రం తిప్పేందుకు ప్రయత్నించారనే కథనాలూ అప్పట్లో వచ్చాయి. సరే, ఆ తరువాత పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం, అంతకుముందు పన్నీరు సెల్వమ్ కొద్దిరోజులు సీఎం ఉండటం, అదే సమయంలో ఒ.పి.ఎస్., ఇ.పి.ఎస్. రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. అయితే, ఈ రెండు వర్గాలు ఏకమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కూడా పెద్దన్న పాత్ర పోషించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే విమర్శలు వచ్చాయి. అదే విషయం అప్పట్లో పన్నీర్ సెల్వమ్ ముందు ప్రస్థావించి.. ‘మీరు ఢిల్లీ వెళ్లింది వర్గాల విలీన ప్రక్రియ గురించి మోడీతో చర్చలకే’ అని అడిగితే.. అబ్బే అదేం లేదూ, రాష్ట్ర ప్రజల సమస్యల్నీ, విద్యా సంస్థలకు సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.
అయితే, ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నారంటే… తమతో పళని వర్గంతో సయోధ్య కుదిర్చిందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అంటున్నారు! థేనిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్నాడీఎంకే పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, దాని కోసం కలిసి పనిచేయాల్సిందిగా మోడీ కోరారన్నారు. అయితే, తాను పార్టీకి సేవకుడిగా మాత్రమే ఉంటాననీ, మంత్రి పదవి అవసరం లేదని మోడీకి చెప్పాను అన్నారు. కానీ, మోడీ ఒప్పుకోలేదనీ, మంత్రిగా కొనసాగుతూ రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఉందని పట్టుబట్టారని చెప్పారు. తాను ఇవాళ్ల మంత్రిగా ఉన్నానంటే అందుకు కారణం ప్రధాని ప్రోత్సాహం మాత్రమే అని పన్నీర్ తేల్చి చెప్పడం విశేషం! అమ్మ మరణం తరువాత ఎన్నో రకాల సమస్యలూ అవమానాలు ఎదురొచ్చాయనీ, కానీ అమ్మపై ఉన్న విశ్వాసంతోనే తాను అన్నీ భరించానంటూ పన్నీర్ కాస్త భావోద్వేగాలతో మాట్లాడారు.
సో.. తమిళనాడు రాజకీయ పరిణామాల వెనక నరేంద్ర మోడీ దర్శకత్వం ఉందంటూ గతంలో వినిపించిన విమర్శలు అక్షరాలా నిజం అని పన్నీరు ప్రకటనతో రుజువైనట్టే కదా! కేవలం ప్రధాని చొరవతోనే ఒ.పి.ఎస్., ఇ.పి.ఎస్. వర్గాలు కలిశాయన్నది వాస్తవం. ఈ విషయాన్ని పన్నీరు సెల్వమ్ బయటపెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓపక్క తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీలూ, కొత్త సమీకరణలకు దారితీస్తున్న పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తమిళనాడు కొంత సంచలనం అవుతాయనే చెప్పాలి. అవకాశం ఉంటే ప్రత్యక్షంగా, లేచి చోట పరోక్షంగానైనా రాష్ట్రాల్లో చక్రం తిప్పాలనేది భాజపా అప్రకటిత రాజకీయ అజెండా. అరుణాచల్ మొదలుకొని ఇప్పుడు తమిళనాడు వరకూ అదే ఆపరేషన్ భాజపా కొనసాగిస్తోంది. ఒకవేళ చక్రం తిప్పేందుకు అవకాశం చిక్కడం లేదంటే వారి వ్యవహార శైలి ఎలా మారుతుందని చెప్పడానికి ఉదాహరణగా ఆంధ్రా నిలుస్తోంది.