జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కొద్ది రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ కలిశారు. ఆయన వెంట కుమారులు కూడా ఉన్నారు. అందరూ కలిసి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్ కల్యాణే ఆహ్వానించారని… ముత్తా వర్గీయులు చెబుతున్నారు. ముత్తా గోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే. నిన్నామొన్నటిదాకా వైసీపీలో ఉన్నారు. పార్టీలో చేరినప్పుడు ప్రాధాన్యం ఇచ్చిన జగన్.. ఆ తర్వాత పక్కన పెట్టేయడంతో మంచి ఫ్లాట్‌ఫాం కోసం కొద్ది రోజులుగా ముత్తా ఫ్యామిలీ ఎదురు చూస్తోంది. వారికి జనసేనలో అవకాశం అంది వచ్చింది.
ముత్తా గోపాలకృష్ణ.. ఆంధ్రప్రభ పత్రిక యజమాని. మరో ఇంగ్లిష్ దినపత్రికలో కూడా వాటా ఉంది. అలాగే… ఆయన కుమారులు.. ఇండియా ఎహెడ్ పేరుతో… న్యూస్ చానల్ కూడా పెడుతున్నారు. ముత్తా గోపాలకృష్ణ పవన్ కల్యాణ్‌ను కలిసినప్పటికీ నుంచి ఆంధ్రప్రభ తీరు మారిపోయింది. పవన్ కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ బ్యానర్ స్టోరీలు వేస్తున్నారు. తను పార్టీలో చేరబోతున్నందుకు ముత్తా అండ్ కో ఈ పని చేయడం లేదు. తమ మార్కెటింగ్ స్ట్రాటజీని తాము పాటిస్తున్నారంటున్నారు. ఆంధ్రప్రభ సర్య్కూలేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అసలు వస్తుందో రాదో అన్నంత తక్కువగా ఆ పత్రిక కాపీలు బయటకు వస్తాయి. అయితే ఇప్పుడు.. ముత్తా గోపాలకృష్ణ మరో ప్లాన్ వేశారు. పవన్ ఫ్యాన్స్ లో సగం తమ పేపర్ ను కొన్నా… సర్య్యూలేషన్ ఆమాంతం పెంచుకోవచ్చని ఆశ పడుతున్నారు. అందుకే… రోజూ పవన్ కల్యాణ్‌ను ఉబ్బేస్తూ బ్యానర్ స్టోరీలు వేసి.. వాటిని మార్కెటింగ్ స్టాఫ్‌కి ఇచ్చి డోర్ టు డోల్ మార్కెటింగ్‌కు పంపుతున్నారు. పవన్ ఫ్యాన్స్ అనే వాళ్లు కనిపిస్తే.. ఆంధ్రప్రభ చందాలు కట్టించాలని ఒత్తిడి తెస్తున్నారు.
ముత్తా గోపాలకృష్ణ.. ఎంత మంది పవన్ ఫ్యాన్స్‌తో తమ పత్రిక కొనిపిస్తున్నారో.. చెప్పాలని రోజువారీ నివేదకలు అడుగుతున్నారట. ఇప్పటికే 99 టీవీ రేటింగ్స్‌ను ఉద్యమంలా పెంచాలనుకుంటున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం శతఘ్నిపేరుతో పక్ష పత్రికను కూడా రిలీజ్ చేశారు. ముత్తా వ్యవహారశైలి చూస్తున్న జనసేన అభిమానులు…. ఆయన వ్యాపారాల కోసమే… ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.