రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి స్టార్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. అందు కోసం వ్యూహాలే కాదు.. నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మోడీని ఓడించడం సాధ్యం కాదన్న అంచనాకు ఎప్పుడో వచ్చిన ఆయన.. ప్రాంతీయ పార్టీలన్నింటినీ .. కాంగ్రెస్‌తో జట్టుకట్టేలా మాట్లాడుతున్నారు. చాలా పార్టీలతో బహిరంగంగా మాట్లాడుతున్నారు. కొద్ది పార్టీలతో అంతర్గతంగా మాట్లాడుతున్నారు. అలా అంత్గతంగా మాట్లాడుతున్న పార్టీల్లో వైసీపీ కూడా ఉందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ కూటమిలో లేదు. రాజకీయ ఇతర అవసరాల కోసం కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో సన్నిహితంగా ఉండక తప్పని పరిస్థితి. అయితే వారికి విజయం అందించిన పీకేపై జగన్‌కు చాలా గౌరవం ఉంది. ఆయన వ్యూహాలపై గురి ఉంది. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఢిల్లీకి పిలిపించి… ఓ పూటంతా పీకే.. జాతీయ రాజకీయాలపై క్లాస్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పరిస్థితి మారిందని.. కాంగ్రెస్ కూటమి వైపు వస్తే.. అంతా మంచి జరుగుతుందని చెప్పారని అంటున్నారు. దీనికి విజయసాయిరెడ్డి ఏం చెప్పారో క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించకపోతే ఇబ్బందులు వస్తాయని మాత్రం చెప్పినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే పీకే కూడా దీనికి సొల్యూషన్ చెప్పారని అంటున్నారు. కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటే… వేధిస్తోందని ప్రచారం చేసుకుని.. సానుబూతి వ్యూహం రూపొందిద్దామని.. బాగా వర్కవుట్ అవుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏడాది లేదా ఏడాదిన్నర ముందుగా కేంద్రంపై యుద్ధం ప్రకటించి.. పీకే సలహా మేరకు కాంగ్రెస్‌తో జట్టుకడితే అప్పుడు.. కేంద్రం .. కేసుల పేరుతో ఇబ్బంది పెట్టినా ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే… పీకే మరో బలమైన పార్టీని కాంగ్రెస్ కూటమి వైపు లాక్కెళ్లినట్లే అవుతుంది. బీజేపీకి షాక్ తగిలినట్లు అవుతుంది.