ఈనెలలో కొత్త సినిమాల కంటే పాత సినిమాలే రీ రిలీజుల పేరుతో ఎక్కువగా విడుదలయ్యాయి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని 35 ఏళ్ల తరవాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. థియేటర్ల దగ్గర చిరు అభిమానుల సందడి కనిపించింది. చిరు పాటలకు… స్టెప్పులు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తొలి మూడు రోజుల్లో అటూ ఇటుగా రూ.2.5 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా కోసం దాదాపు రూ.5 కోట్లు ఖర్చు పెట్టారట. ఎందుకంటే జగదేక వీరుడు ప్రింట్ ఎక్కడా దొరకలేదు. విజయవాడలోని ఓ పాత థియేటర్లో ప్రింట్ ఉంటే వెదికి మరీ తీసుకొచ్చారు. అది శిధిలావస్థకు చేరుకొంది. దాన్ని 4 కేలో మార్చడానికి చిత్రబృందం చాలా కష్టపడాల్సివచ్చింది. త్రీడీ వెర్షన్లో ఈ సినిమాని మళ్లించడానికి కూడా బాగానే ఖర్చు పెట్టారని టాక్. అంటే సగం పెట్టుబడి కూడా రానట్టే. వైజయంతీ మూవీస్ సంస్థకు ప్రతిష్టాత్మక చిత్రమిది. అలాంటి సినిమాని రీ రిలీజ్ చేయడం వైజమంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. అందుకే ఖర్చు గురించి పట్టించుకోలేదు.
ఇంత చేసినా… సరైన క్వాలిటీ రాలేకపోయింది. విజువల్స్ లో క్వాలిటీ మిస్ అయ్యింది. ఐకానిక్ గీతం.. ‘అబ్బనీ తీయని దెబ్బ’ పాటలో బ్లూ డ్రస్సు కాస్త రంగులు మారిపోయింది. త్రీడీ ఎఫెక్టులు కూడా బొత్తిగా కుదర్లేదని తెలుస్తోంది. త్రీడీలో కంటే 2డీలో ఈ సినిమా చూడడమే నయం అంటున్నారు ఫ్యాన్స్.
కొన్ని సినిమాలు రీ రిలీజులు అయ్యి నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చి పెట్టాయి. అయితే అన్ని సినిమాల విషయంలో ఇది జరగని పని. పాత ప్రింటు వెదికి పట్టుకొని, దాన్ని 4కేలో మార్చడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రింటు బాగుంటే ఫర్వాలేదు. సరైన ప్రింటు దొరక్కపోతే మరింత ఖర్చు, శ్రమ. ‘జగదేక వీరుడు’ విషయంలో ఇదే జరిగింది. చాలా సినిమాల్ని రీ రిలీజ్ చేయాలన్నది అభిమానుల కోరిక. నిర్మాతలకూ ఆ ఆశ ఉంటుంది. కానీ ప్రింటు దొరక్క ఆగిపోతున్నారు.