నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన అతి కొద్దిమంది కథానాయికలలో సమంత ఒకరు. తాను నిర్మాతగా రూపొందించిన సినిమా ‘శుభం’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీసు దగ్గర యావరేజ్ మార్కులు తెచ్చుకొంది ‘శుభం’. రివ్యూలు కూడా ‘ఓకే ఓకే సినిమా’ అన్నాయి. దర్శకుడు ఇంకాస్త ఎఫెక్ట్ పెట్టాల్సిందని తేల్చేశాయి. మొత్తానికి సమంతకు ఇది మిశ్రమ అనుభవం. కాకపోతే నిర్మాతగా సంతృప్తి దొరకాలంటే ఆర్థిక పరమైన లెక్కలు లేతాలి. ఈ సినిమా ఆర్థిక పరంగా సేఫ్ జోన్లో పడిపోయిందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. జీ తెలుగు సంస్థ ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. ఆ రూపేణా ఈ సినిమా తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోగలిగింది. అలా చూస్తే సమంత తొలి అడుగులోనే విజయం సాధించినట్టు.
ఓటీటీ, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోవడం కూడా ఈరోజుల్లో చిన్న విషయమేమీ కాదు. మీడియం రేంజ్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీ బేరాల్లేక బోరుమంటున్నాయి. ఇలాంటి దశలో సమంత తన సినిమాని విడుదలకు ముందే అమ్మేసింది. సమంతకు ఉన్న ఇమేజ్ అందుకు ప్లస్ అయ్యింది. పైగా కథా పరంగా ఇదో సీరియస్ సబ్జెక్ట్. ఓ ఛానల్ లో వచ్చే సీరియల్ చుట్టూ నడుస్తుంది. సినిమా ఎలా ఉన్నా ఛానల్ బ్రాండింగ్ పెరుగుతుంది. అందుకే జీ తెలుగుని ముందుగా సంప్రదించి, బ్రాండింగ్ మాట్లాడుకొని, అప్పుడు సినిమా మొదలెట్టారు. అది ఓరకంగా మంచి ఆలోచన. బ్రాండింగ్ కి కమిట్ అయిన జీ తెలుగు.. ఆ తరవాత శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది.
సమంత ప్లానింగ్ తొలి సినిమాకు వర్కవుట్ అయ్యింది. ఇక మీదట తన బ్యానర్ లో వచ్చే సినిమాల క్వాలిటీ విషయంలో సమంత దృష్టి పెట్టాలి. చిన్న, మీడియం రేంజ్ సినిమాలైనా, క్వాలిటీ మేకింగ్ ఉండాలి. ‘శుభం’లో అది కనిపించలేదు. ఈ విషయంలో సమంత జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది.