ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సాక్షత్తూ ఆ శాఖమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. బండిని ఈడ్చటం బహు కష్టంగా ఉందనీ, ఎలాగోలా నెట్టుకొస్తున్నాం అని చెప్పారు. ప్రణాళికేతర వ్యయాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. శాఖలన్నీ వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టాలనీ, దుబారా తగ్గించుకోవాలని ఆయన సూచించారు. వివిధ శాఖల పేరుతో ఉన్న డిపాజిట్లను పబ్లిక్ డిపాజిట్ ఖాతాలోకి జమ చేయాలంటూ ఆదేశించబోతున్నట్టు చెప్పారు.
ఏపీ సర్కారు చేస్తున్న ప్రకటనలు ఏవి నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఓ పక్క రాష్ట్రం అద్భుతంగా ఉందని అంటారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారంటారు. కరువు పోయిందంటారు. ఇంకోపక్క… ఇదిగో ఇలా బీద ప్రకటనలు చేస్తుంటారు. అయినా, దుబారా వ్యయం గురించి ఏపీ సర్కారు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచీ ఖర్చుల విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదన్న విషయం అందరికీ అర్థమౌతూనే ఉంది. హంగులూ ఆర్భాటాలూ ప్రచారాలకు ప్రభుత్వమే ప్రాధాన్యత ఇస్తూ.. మళ్లీ దుబారా తగ్గించుకోవాలని చెప్పడమేంటో..?
రాజధాని అమరావతి శంకుస్థాపన పేరుతో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంత ఖర్చు అవసరమా చెప్పండీ! ఇక, రాజధానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చుదిద్దుతాం అన్నారు. అది మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ, డిజైన్ల తయారీ పేరుతో ఇప్పటివరకూ చాలా ఖర్చు చేశారు. కాసేపు సింగపూర్ కంపెనీ అంటారు, ఇంకాసేపు మలేసియా డిజైన్లంటారు! నమూనాల తయారీకే దాదాపు రూ. 100 కోట్లు ఖర్చులు అయిపోయి ఉంటాయని విమర్శలున్నాయి. కేవలం నమూనాల తయారీకి ఇంత ఖర్చా…? ఇందులో దుబారా కనిపించడం లేదా..?
తాత్కాలిక సచివాలయం నిర్మాణం అంటూ దాదాపు రూ. 1000 కోట్ల వరకూ ఖర్చు చేసేశారు. అదనపు సౌకర్యాల పేరుతో ఎప్పటికప్పుడు అంచనాలు మార్చేసి, నిర్మాణ వ్యయాన్ని అనుకున్నదానికంటే రెండింతలు చేశారు. కేవలం తాత్కాలిక నిర్మాణాలకే ఇంత ఖర్చా..? ఇందులో దుబారా నియంత్రణ ఎక్కడ జరిగిందో సర్కారువారు చెప్పగలరా..? ఈ మధ్యనే కృష్ణా పుష్కరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. రూ. 1000 కోట్లతో పుష్కరాల ఏర్పాట్లు కానిచ్చేద్దాం అని మొదట అనుకున్నారు. కానీ, పుష్కరాలు పూర్తయ్యే సరికి ఆ ఖర్చు రెండింతలైందని చెబుతున్నారు! పోనీ.. పుష్కరాల పేరుతో నిర్మించిన నిర్మాణాల నాణ్యత ఏ రేంజిలో ఉన్నాయో ఓ వారం పదిరోజుల కిందటి పత్రికలను తిరగేస్తే తెలుస్తుంది..! ఇక్కడా దుబారా కనిపించడం లేదా..? రాజధానిలో మంత్రుల ఇళ్ల అద్దెలు, సౌకర్యాలు, ఖర్చులు… వీటిపై స్వీయ నియంత్రణ పాటించిన నాయకులు ఎవరైనా ఉన్నారా..? ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించడం లేదు. కానీ, దుబారా తగ్గించుకోవాలని వారే సూచిస్తుంటారు! ఇదేం చిత్రమో!