తెలంగాణ కాంగ్రెస్ నేతల అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తట్టుకోవడం .. ఢిల్లీ నుంచి వచ్చే కాంగ్రెస్ ముఖ్యులకు ఎప్పుడూ సాధ్యం కాదు. వారు వస్తారు ఏడాది పాటు ఉంటారు.. తర్వాత మా వల్ల కాదని చేతులెత్తేస్తారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా తన వల్ల కాదని తనకు విముక్తి కల్పించాలని హైకమాండ్ ను కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఇతర నేతల్లాంటి వారు కాదని వదిలి పెట్టరని.. దారిలో పెట్టే వెళ్తారని కొంత మంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు.
ఇతర ఇంచార్జుల్లా కాదు.. సీరియస్ లీడర్ మీనాక్షి
తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న మీనాక్షి, గత ఏడాది ఫిబ్రవరిలో దీపాదాస్ మున్షీ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఏడాది తిరగకముందే ఆమె నిష్క్రమణపై వస్తున్న వార్తలు పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఆమె అలా చేతులెత్తేసిన వెళ్లిపోయే రకం నేత కాదని కొంత మంది గుర్తు చేస్తున్నారు.
గత ఇంచార్జులంతా భరించలేకపోయిన వారే !
తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో పని చేసిన ఇన్ఛార్జ్లు మాణిగం ఠాగోర్, మాణిక్ రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ వంటి వారు కూడా ఇక్కడి నాయకులను సమన్వయం చేయలేక ఇబ్బందులు పడ్డారు. ఆ బాధలు పడలేకనే వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన డీసీసీ అధ్యక్షుల నియామకం, నామినేటెడ్ పదవుల పంపిణీలో పెరిగిన అసమ్మతి మీనాక్షికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతల మధ్య సమన్వయం కుదర్చడం, అసంతృప్తికి గురైన వారిని బుజ్జగించడం వంటి అంశాల్లో ఆమె తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అందుకే ఆమె స్వయంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని అధిష్టానానికి విన్నవించినట్లు కాంగ్రెస్‌లోని ఓ వర్గం మీడియాకు లీకులు ఇచ్చింది
దుష్ప్రచారమా? వాస్తవమా?
ఈ ప్రచారాన్ని మీనాక్షి అనుకూల వర్గం కొట్టిపారేస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆమె కృషి చేస్తున్నారని, ఆమె పనితీరు నచ్చని కొందరు ఉద్దేశపూర్వకంగానే కక్షగట్టి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇన్ఛార్జ్ మారిపోతున్నారనే వార్తలు వ్యాప్తి చేయడం ద్వారా కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని మద్దతుదారులు భావిస్తున్నారు. మొత్తంగా ఇలాంటి ప్రచారం జరగడం మాత్రం.. తెలంగాణ కాంగ్రెస్ నేతల దూకుడు రాజకీయాలకు సాక్ష్యంగా మారుతోంది.
