తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు క్షేత్రస్థాయిలో పాలన గాడిలో పడలేదన్న విమర్శలు ఇప్పుడు సామాన్యుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులు, రాజకీయ వ్యూహాలపై చూపే శ్రద్ధను ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే చిన్న చిన్న అంశాలపై చూపకపోవడం ఇప్పుడు పాలనా వైఫల్యానికి అద్దం పడుతోంది.ఇవే ప్రజలపై ఎక్కువ ముద్ర వేస్తాయన్న సంగతిని మర్చిపోతున్నారు.
పర్యాటక కళ తప్పిన నగర ప్రతీకలు
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే పర్యాటక ప్రాంతాల నిర్వహణ ప్రస్తుతం దారుణంగా ఉంది. ముఖ్యంగా ఐటీ హబ్‌కు గుండెకాయ వంటి దుర్గం చెరువు మొత్తం గుర్రపుడెక్కతో నిండిపోయి, మురికి కూపంగా మారుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు టూరిజం కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయి. అలాగే కేబుల్ బ్రిడ్జి నిర్వహణలో నిర్లక్ష్యం, రోడ్లపై గుంతలు వంటివి చూస్తుంటే ప్రభుత్వం కనీస పౌర సదుపాయాల విషయంలో నాసిరకం పనితీరును ప్రదర్శిస్తోందని అర్థమవుతోంది. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా, సామాన్యుడి దృష్టిలో ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసే కొలమానాలు ఇవే.
టి-హబ్‌లో ప్రభుత్వ కార్యాలయమా – తిరోగమనానికి చిహ్నం
ప్రభుత్వ తాజా నిర్ణయాలు అత్యంత వింతగా, అభివృద్ధిని వెనక్కి నెట్టేలా ఉన్నాయి. స్టార్టప్‌లకు, ఇన్నోవేషన్లకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టి-హబ్ భవనంలోకి ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ వంటి ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించాలని చూడటం ముమ్మాటికీ తిరోగమనమే. ప్రైవేటు భవనాల అద్దెలు తగ్గించే సాకుతో 39 ప్రభుత్వ కార్యాలయాలను సొంత భవనాల్లోకి మార్చాలన్న నిర్ణయం సరైనదే కావచ్చు, కానీ ఐటీ , స్టార్టప్ సంస్కృతికి చిహ్నమైన టి-హబ్‌ను ఒక సాధారణ ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి.
ప్రజలు నమ్మేది తమ ఎదురుగా కనిపించేవాటినే !
పాలనలో మార్పు అనేది కేవలం విధానాల్లోనే కాదు, క్షేత్రస్థాయిలో కనిపించే మార్పుల్లో ఉంటుంది. ఒక పర్యాటక ప్రాంతం మురికిమయం కావడం, ఒక ఇన్నోవేషన్ హబ్ ప్రభుత్వ కార్యాలయంగా మారడం వంటివి ప్రభుత్వం ప్రాధాన్యతలను మరచిపోయిందనడానికి నిదర్శనంగా ప్రజలు భావిస్తారు. . విదేశీ పెట్టుబడుల కోసం దావోస్ వంటి వేదికలపై ప్రయత్నిస్తూనే, ఇక్కడ ఉన్న ఉన్నత ప్రమాణాల వ్యవస్థలను ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడం పరస్పర విరుద్ధమైన చర్యలు. ఇవి ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో మౌలిక సదుపాయాల కల్పన , నిర్వహణ నిరంతర ప్రక్రియ. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన మున్సిపల్, రోడ్లు భవనాల శాఖలు మొద్దుబారిపోయినట్లు కనిపిస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, విచారణలకే సమయాన్ని వెచ్చిస్తూ, ప్రజల మౌలిక అవసరాలను విస్మరిస్తే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తక్షణ దిద్దుబాటు అవసరం
రేవంత్ సర్కార్ ఇప్పటికైనా మేల్కొని ఈ చిన్న చిన్న సమస్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నగర సౌందర్యం, మౌలిక సదుపాయాలు , ఐటీ బ్రాండ్ ఇమేజ్ను కాపాడటంలో రాజీ పడకూడదు. టి-హబ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఉనికిని కాపాడటంతో పాటు, దుర్గం చెరువు వంటి పర్యాటక కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చేయాలి. కేవలం రాజకీయ ప్రసంగాలతో కాకుండా, పారదర్శకమైన , వేగవంతమైన పాలనతోనే ప్రజల మనసు గెలవగలరని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది.లేకపోతే ఈ చిన్న చిన్న గుంతలే రేపు ప్రభుత్వానికి పెద్ద గండాలుగా మారే ప్రమాదం ఉందని చెప్పాల్సిన పని లేదు.
