బాబు విదేశీపర్యటనలతో ఒరిగేదేమైనా ఉందా?

పెట్టుబడులను సమీకరించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మళ్ళీ మూడురోజులపాటు విదేశాలకు వెళుతున్నారు. పెట్టుబడిదారులకూ, ఆంధ్రప్రదేశ్ కూ సమానమైన ప్రయోజనాలు వుండేపక్షంలో ఎవరు పెట్టుబడిపెట్టినా అభ్యంతరపెట్టవలసిన అవసరంలేదు. అయితే ఇప్పటికే ఒకసారి ముగిసిన చంద్రబాబు జపాన్ పర్యటన ఒప్పందాల్లో ఏవీ మన రాష్ట్రంలో భారీ ఉపాధి అవకాశాలను కల్పించేవిగా లేవు.

చంద్రబాబు జపాన్‌ లో ప్యూజే ఎలక్ట్రానిక్స్‌, జైకా, మిత్సుబిషి, సుమిటోమి, జెబిఐసి, మయావక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో స్మార్ట్‌ ఎనర్జీ ప్రాజెక్టును తోషిబా సంస్థకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పోలాకి విద్యుత్‌ ప్రాజెక్టును గ్లోబల్‌ టెండర్లు పిలవకుండా సుమిటోమి సంస్థకు అప్పగించారు. తిరుపతిని సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం కుదిరింది. ఆ సంస్థే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది, ఆర్థిక సహాయం అందిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎపిలో వేస్టు టు ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నామని, వాటిలో పాల్గొనాలని ప్రత్యేకంగా జెఎఫ్‌ ఇంజనీరింగ్‌ను చంద్రబాబు ఆహ్వానించారు.

రైతుకు లాభసాటి వ్యవసాయం అన్న నినాదం ఇచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఆహార వస్తువుల ప్రాసెస్, ప్యూరిఫికేషన్,పంపిణీ కోసం జైకా సంస్థ ఆసక్తి చూపుతోందని చెప్పారు. ఇందులో ఆసంస్ధ లాభాలేతప్ప రైతు ప్రయోజనాలు చాలాతక్కువ. మేక్‌ ఇన్‌ ఇండియా, రైతుకు లాభసాటి వ్యవసాయం, నినాదాల్లో ఆహార ఉత్పత్తి స్థానం వెనక్కిపోయి శుద్ధి, పంపిణీలు ముందుకొచ్చాయి. సంప్రదాయ ఆహార వినియోగం స్థానంలో ఫాస్ట్‌ఫుడ్‌ వినియోగం సంస్కృతిని పెంచేందుకు ఆ ఒప్పందం దోహదపడుతుంది. జైకా సంస్థ మార్కెట్‌ విస్తరణకు లబ్ధి చేకూరుతుంది.

జపాన్ నుంచి ఎక్కడ, ఏ రూపంలో పెట్టుబడులు ఎంత వస్తాయన్నది స్పష్టం కాకముందే జపాన్‌ సామాజిక అధ్యయన కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఆ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ మిత్సుబిషి ముందుకోచ్చింది. ఆ కేంద్రం ద్వారా జపాన్‌ భాష, సంస్కృతిని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని మిత్సుబిషి సంస్థ చెబుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు, వాణిజ్య వ్యాపారాలకు తోడుగా ఆ కేంద్రం ఉంటుందని ప్రకటించింది. జపాన్ వారికే ఆ తోడు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

ముఖ్యమంత్రి పర్యటనలో భారీ పెట్టుబడులు వచ్చి ఉపాధి కల్పన జరిగే ఒప్పందాలేవీ జరగలేదు. ప్రచారానికి తగ్గ పెట్టుబడులు రావడం లేదు. రాష్ట్రానికి వస్తాయనుకున్న పరిశ్రమలూ ఇప్పటికే ఆచరణ రూపం దాల్చలేదు. విదేశీపెట్టుబడుల్లో రాష్ట్ర ప్రయోజనం, ప్రజల ప్రయోజనం కంటే లాభాల కాంక్ష ఎక్కువగా ఉంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకహోదా వల్ల లభించే రాయితీల కారణంగా దేశీయులు విదేశీయులుకూడా పరిశ్రమల స్ధాపనకు పోటీ పడివస్తారు. స్వావలంబన రీతిలో ఉపాధి కల్పన పరిశ్రమలు వస్తాయి. అందువల్ల ఏదోరకంగా, ఏదోరూపంలో ప్రత్యేక హోదా వల్ల కలిగే రాయితీలన్నీ లభించేలా చేయగలిగితే రాషా్ట్రనికి మేలు జరుగుతుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com