హైదరాబాద్ ఐటీ కారిడార్లో అత్యంత విలువైన భూమిని వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నంబర్ 83/1కు చెందిన 18.67 ఎకరాల భూమిని వేలం వేయనున్నట్లు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ప్రకటించింది. ఈ భూమి ఎకరానికి రూ.101 కోట్లను అప్ సెట్ ధరగా నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలి కాలంలో ప్రభుత్వ భూములను వేలం వేసి ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇటీవల రాయదుర్గం, ఒస్మాన్ నగర్ ప్రాంతాల్లో 66 ఎకరాలకు పైగా భూమిని వేలం వేసిన TGIIC, ఇప్పుడు మరో ప్రధాన ప్రాజెక్టుగా ఈ 18.67 ఎకరాలను ఎంచుకుంది. ఈ భూమి ఐటీ కంపెనీల మధ్యలో ఉంటుంది. అత్యంత ఎత్తైన ఐటీ ఆఫీసులు నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే డెవలపర్లు , ఇన్వెస్టర్ల నుంచి భారీ ఆసక్తి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత వేలాల్లో ఇలాంటి భూములు ఎకరానికి రూ.104 కోట్ల వరకు విక్రయమైన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా బిడ్డింగ్ ప్రక్రియలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. TGIIC ఈ వేలం కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజరీ కన్సల్టెంట్లను నియమించే ప్రక్రియలో ఉంది. భూమి విక్రయం నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.