అధికార పార్టీలో ఉన్నవారికి చట్టం చుట్టంగా ఉంటుందని కొంతమంది విమర్శిస్తుంటారు! అందుకే, అధికార పార్టీ పంచన చేరేందుకే నాయకులు మొగ్గు చూపుతూ ఉంటారు. అధికారం ఉన్న చోటు ఉండే ప్రయోజనాలు వేరులెండి! అధికారం ఉన్నవారికి ఉన్న సౌకర్యాలే వేరులెండి! కానీ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతిపై పోరాటం చేస్తున్నాం అని చెప్పుకునే తిరిగే నాయకుల్లోనే అలాంటివారు ఉన్నారనే విషయం బయటపడటంతో దేశం క్యాంపులో గందరగోళ పరిస్థితి నెలకొంది. సరిగ్గా నాలుగంటే నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. భారీ ఎత్తున అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
శనివారం నాడు చిత్తూరు జిల్లాకు చెందిన శాసన సభ్యురాలు సత్యప్రభకు చెందిన సంస్థలూ ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. ఈ దాడుల్లో రూ. 267 కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. రూ. 43 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బెంగళూరులో వెల్లడించారు. లిక్కర్ కింగ్ విజయమాల్యాతో సత్యప్రభ కుటుంబానికి మాంచి దోస్తీ ఉందన్న అనుమానాలు వ్యక్తం కావడం, మాల్యా దేశాన్ని విడిచి వెళ్తూ కొన్ని ఆస్తుల్ని బినామీల దగ్గర భద్రపరచాడన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సరిగ్గా, నాలుగు రోజులు కిందట మరో దేశం ఎమ్మెల్యే ఎం. వేణుగోపాలరెడ్డి ఆస్తులపై కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. గుంటూరు పశ్చిమ నియోజక వర్గానికి వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ అక్రమ ఆస్తులకు సంబంధించిన లెక్కల్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకు చెప్పాల్సి ఉంటుంది.
అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇళ్లపై ఐటీ దాడులు జరగడంతో దేశం నేతల్లో గుబులు మొదలైంది. అధికారంలో ఉన్నవారిపై సాధారణంగా ఇలాంటి దాడులు లాంటి అప్రకటిత చర్యలేవీ ఉండవని అంటుంటారు! అలాంటిది, నాలుగు రోజుల్లోనే ఇద్దరు దేశం ఎమ్మెల్యేల ఆస్తులపై ఐటీ రైడ్స్ అంటే… దీని వెనక ఏవైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే, తాజా దాడుల వల్ల రాజకీయంగా తమకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురౌతుందని కొంతమంది దేశం నేతలు వాపోతున్నట్టు సమాచారం. అవినీతి పేరుతో ప్రతిపక్షంపై విరుచుకుపడే తమకు, ఈ ఇద్దరి ఎమ్మెల్యేల తీరు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారట. ఈ రెండు దాడులూ వేర్వేరు కారణాల వల్ల జరిగాయా… వెనక ఏదైనా రాజకీయ కారణం ఉందా అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.