కేసీఆర్ హవా ఎంతకాలం సాగుతుంది?

హైదరాబాద్: పశ్చిమ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలలో దేశాధినేతల పాపులారిటీపై నిర్దిష్ట కాలవ్యవధులతో తరచూ సర్వేలు నిర్వహిస్తుంటారు. మనదగ్గర ఆ సర్వేలు అరుదుగా జరుగుతుంటాయిగానీ, జరిగితే కేసీఆర్ పాపులారిటీ ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లు ఫలితాలు వచ్చిఉండేవనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణలో పరిస్థితి ఇప్పడు అలాగే ఉంది. సోనియా గాంధీ విభజనకు నిర్ణయం తీసుకోవటంతో మొదలైన కేసీఆర్ హవా అంతకంతకూ ద్విగుణీకృతమవుతోంది. వరంగల్ ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు, నారాయణఖేడ్ ఉపఎన్నికలలో వరసగా అద్భుత విజయాలు సాధించటం ఒక ఎత్తయితే ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డిని, ప్రత్యర్థి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడునూ ఒకేసారి ఓటుకు నోటు కేసులో ఇరికించి అదురుదెబ్బ కొట్టటం మరొక ఎత్తని చెప్పాలి. 10 మంది ఎమ్మెల్యేలను లాక్కోవటంద్వారా తెలుగుదేశం పార్టీని కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా తెలంగాణలో ఏమంత గొప్పగా లేదు. ఆ పార్టీనుంచి కూడా టీఆర్ఎస్‌లోకి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వెళ్ళగా, మరికొందరు క్యూలో ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రత్యర్థి పార్టీల నాయకులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నాయి. వారు చేష్టలుడిగిపోయి చూస్తున్నారు. ఇప్పుడు వారందరి ముందూ ఉన్నది ఒకటే ప్రశ్న! ఇది ఎన్నాళ్ళు సాగుతుంది?

కేసీఆర్ ప్రకటిస్తున్న హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణలో ఒక ‘ఫీల్ గుడ్’ వేవ్ అయితే ఉన్నట్లుగా కనిపిస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ వంటి అంశాలతో అంతా బాగున్నట్లనిపిస్తోంది. అయితే గతంలో పెద్దగా పాలనానుభవంలేని కేసీఆర్, వెళ్ళినచోటల్లా అలనాటి రాజుల లెవల్‌లో ప్రకటిస్తున్న వరాలతోనే ఇబ్బంది వస్తోంది. విభజన నాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లోటు బడ్జెట్ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. కేసీఆర్‌కు మరి ఈ అంశంపై అవగాహన ఉందో, లేదో తెలియటంలేదు. అన్నిచోట్లా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తానంటున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 1.29 లక్షల 2బీకే ఇళ్ళు(ఒక్కొక్కదానికి రు.7 లక్షల వ్యయం) కట్టిస్తామని ప్రకటించారు. వీటికోసం పేదలు జాతరగా వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. మరి వీటికి లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలు ఏమిటనేది ఇంకా స్పష్టంగా లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా ప్రతి నియోజకవర్గానికి నాలుగు వందల 2బీకే ఇళ్ళు కట్టిస్తామని చెబుతున్నారు. ఈ పథకం సరిగా అమలు జరగకపోతే ఇదే బూమరాంగ్ అవ్వటం ఖాయం. ఇక కేసీఆర్ ఇచ్చిన మిగిలిన ప్రధాన హామీలను చూస్తే ప్రతి దళితుడికీ మూడెకరాల భూమి ఇస్తామని ఎన్నికలముందు వాగ్దానం చేశారు. ఒక గుప్పెడుమందికి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఆ హామీకి అతీగతీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు హామీని నిన్నటి ఖమ్మం సభలో కూడా ప్రస్తావించారు. ఈ 20 నెలల కాలంలో లక్ష ఎకరాలకు మాత్రమే అందించగలిగారని అంటున్నారు. మరి మిగిలిన 40 నెలల కాలంలో 99 లక్షల ఎకరాలకు ఏ లెక్కన అందిస్తారో ఏలినవారే చెప్పాలి. 1,25,000 ఉద్యోగాల హామీలో ఇంతవరకు 25,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. హామీల విషయం వచ్చింది కాబట్టి మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోను ప్రకటిస్తూ కేసీఆర్ వేసిన జోక్‌ లాంటి హామీని ప్రస్తావించుకోవాలి. జీహెచ్ఎంసీ అంటేనే అవినీతి అని బాగా పేరుపడిపోయిందని, దానిని పూర్తిగా రూపుమాపుతామని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలవటానికి రు.2 కోట్లనుంచి రు.12 కోట్ల దాకా ఖర్చుపెట్టినవారు – గెలిచిన తర్వాత ఆ డబ్బును వడ్డీతో సహా సంపాదించుకోవటానికి ప్రయత్నించకుండా ఉండరు. మరి జీహెచ్ఎంసీలో అవినీతిని గులాబీనేత ఎలా రూపుమాపుతారో అర్థం కావటంలేదు.

ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం ప్రధానంగా చెప్పుకోవాలి. కేసీఆర్‌ హనీమూన్ కాలాన్ని తెలంగాణ ప్రజలు పొడిగించారు… ఇంకా పొడిగిస్తారుకూడా. దారుణమైన తప్పిదాలు చేస్తే తప్ప ఈ హనీమూన్ కాలాన్ని 2019 తర్వాత కూడా పొడిగించినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే మాటల మాంత్రికుడయిన కేసీఆర్ 2019 ఎన్నికల్లో కూడా, 60 ఏళ్ళపాటు ఆంధ్రావాళ్ళు చేసిన నాశనాన్ని సరిచేయటానికి ఐదేళ్ళు సరిపోతుందా అని దబాయిస్తారు కాబట్టి. ఒకరకంగా ఇలాంటి అనూహ్యమైన మద్దతు, బలం వచ్చినపుడు పాలకులు మంచి మార్గంలో నడిస్తే ఆ ప్రాంతం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అభివృద్ధికోసం ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నా ప్రతిఘటన, అడ్డంకులు ఉండవు కాబట్టి. కానీ ఈ బలాన్ని, మద్దతును ఆ పాలకులు దుర్వినియోగం చేసుకుని కల్లబొల్లి కబుర్లతో కాలం గడిపితే తొందరలోనే కనుమరుగయిపోతారు. మరి కేసీఆర్ ఈ బలాన్ని ఎలా ఉపయోగించుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేడిన్ ఇండియా 5G జియోదే..!

రాబోయే 5G కాలం ఇండియాలో జియోదేనని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో సొంతంగా 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని.. వచ్చే ఏడాది నుంచే.. ప్రపంచ స్థాయి సేవలను భారత్‌లో అందిస్తామని స్పష్టం చేసింది....

ఏపీలో 25 కాదు 26 జిల్లాలు..!?

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జిల్లాల సరిహద్దులపై సిఫార్సు చేసేందుకు కమిటీ నియమించేందుకు కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది....

తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత కరోనా చికిత్స..!

వైరస్ ట్రీట్‌మెంట్ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. టెస్టులు కూడా.....

కేంద్రం చేతుల్లో “కూల్చివేత” ప్రక్రియ..!?

సచివాలయం కూల్చివేత విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఏదీ కలసి రావడం లేదు. కూల్చివేతకు పర్యావరణ అనుమతుల విషయం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చినప్పుడు.. అనుమతులు అవసరమే లేదని వాదించింది. కూల్చివేత నిలిపివేయాలంటూ పిటిషన్ వేసిన...

HOT NEWS

[X] Close
[X] Close