మోహన్ బాబు యూనివర్శిటీ విద్యార్థుల వద్ద మూడేళ్లలో రూ. 26 కోట్లు అదనంగా ఫీజులు వసూలు చేసిందని అధికారికంగా ఆడిట్ లెక్కల ద్వారా తేలింది. దీన్ని ఆ సంస్థ ఖండించడం లేదు. స్వచ్చందంగా కట్టారనో.. మరో కారణమో చెబుతోంది. ఉన్నత విద్యాకమిషన్ ఇచ్చిన నోటీసులు, రిపోర్టులపై స్టే తెచ్చుకుంది.కానీ ఆ స్టే గడువు ముగిసిపోయింది. ఇప్పుడు విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత మోహన్ బాబు యూనివర్శిటీలో చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు చాలా మంది .. అక్కడి ఫీజుల దోపిడీపై యూట్యూబ్ చానళ్లతో మాట్లాడుతూ చాలా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ దానికి డబ్బుతో ముడిపెట్టి.. వసూళ్లు చేయడం కామన్ అనేది ప్రధానంగా వస్తున్న కంప్లైంట్. ఇంకా విచిత్రం ఏమిటంటే దానికి క్రమశిక్షణ అని పేరు పెడుతున్నారని అంటున్నారు. క్రమశిక్షణ నేర్పాలి కానీ ఆ పేరుతో డబ్బులు వసూలు చేస్తే ఎలా అన్నది చాలా మంది కంప్లైంట్.
ఇక అనుమతించిన దాని కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేయడం కూడా నేరమే. రాజకీయంగా పలుకుబడి ఉందని లేదా సినీ రంగంలో ఓ పెద్ద ఫ్యామిలీ అని..తాము ఏం చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు అనుకుంటే.. కష్టమే. వ్యవస్థలు తమ పని తాము చేసుకుంటాయి. కానీ ఇక్కడ మోహన్ బాబు గౌరవం కూడా ఇమిడి ఉంది. ఇప్పటికే ఆయన కుటుంబం చాలా వివాదాల్లో ఉంది. ఆ వివాదాల్లో కూడా యూనివర్శిటీ విద్యార్థులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు విచారణలో అవే బయటకు వచ్చాయి. ఇలాంటి సమయంలో విద్యార్థుల వద్ద అదనంగా వసూలు చేసిన డబ్బును వారికి తిరిగి చెల్లించడం ద్వారానే మోహన్ బాబుకు కాస్త గౌరవం దక్కుతుంది. లేకపోతే ఆయన యూనివర్శిటీ గుర్తింపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.