సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఇంటి నుంచి ఓ హీరోయిన్ రాబోతోంది. తనే.. జాన్వీ స్వరూప్. తనెరో కాదు.. కృష్ణ మనవరాలు.., మంజుల కుమార్తె. త్వరలోనే తెరంగేట్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నటన, డాన్సింగ్ కి సంబంధించిన ట్రైనింగ్ మొత్తం తీసుకొంది. కొన్ని కథలు కూడా రెడీ అయ్యాయి. డెబ్యూ సినిమాపై సంతకాలు కూడా పెట్టేసింది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
మంజులకు కూడా హీరోయిన్ గా నటించాలని ఉండేది. ఓ సినిమాలో హీరోయిన్ గా తన పేరు ప్రకటించారు. కానీ అప్పట్లో సూపర్ స్టార్ అభిమానుల నుంచి అసంతృప్తి గళం వినిపించింది. తమ అభిమాన హీరో కూతుర్ని హీరోయిన్ గా చూడలేమని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. దాంతో కృష్ణ వెనకడుగు వేశారు. ఆ తరవాత ఘట్టమనేని మంజుల నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. అడపా దడపా కొన్ని కీ రోల్స్ లో కనిపించేవారు. ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ఆ ఇంటి నుంచి ఓ హీరోయిన్ ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రమేష్ తనయుడు ఇప్పుడు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మహేష్ తనయుడు గౌతమ్, కూతురు సితార కూడా సినిమాల్లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. వాళ్లని మహేష్ ఎలా చూడాలనుకొంటున్నాడో?
