ఒక్క సారి ఓడిపోయామని.. లోకసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఏ మాత్రం కంగారు పడటం లేదు. పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతోనే ఉంది. భారత రాష్ట్ర సమితి అనే పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి అని మార్చాలని కూడా అనుకోవడం లేదు. ఢిల్లీ వరకూ పోవడానికి తమ వద్ద రోడ్ మ్యాచ్ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిర్మోహమాటంగా చెబుతున్నారు. అందరూ అతిశయోక్తి అనుకుంటారు కానీ.. ఆయన మాత్రం చాలా సీరియస్ గా ఈ కబుర్లు చెప్పారు.
ఓ టీవీ చానల్ కు సండే ఇంటర్యూ ఇచ్చిన జగదీష్ రెడ్డి.. తమ జాతీయ ప్రణాళికల్ని వివరించారు. మళ్లీ హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తామని.. ఢిల్లీలోని గాంధీనగర్ వరకూ పట్టు సాధిస్తామని ప్రకటించారు. BRS పుట్టిందే భారత దేశం కోసమని.. ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం మాత్రమే కాదని.. భారతదేశం కోసమని.. కేసీఆర్ ఖచ్చితంగా ప్రధాని అవుతారని నమ్మకం వ్యక్తం చేశారు. ఈసారి ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు పెద్ద పాత్ర పోషించి చూపిస్తామన్నారు. మొదట కర్ణాటక, మహారాష్ట్ర మీదగా గుజరాత్ చేరుకుంటామని.. అక్కడి నుండి రాజస్థాన్ మీదుగా ఢిల్లీ వెళ్తామని తమ రోడ్ మ్యాప్ వివరించారు. ఎంపీ, యూపీ మీదగా హర్యానా వెళ్ళి ఢిల్లీలో చక్రం తిప్పుతామన్నారు.
జగదీష్ రెడ్డి రోడ్ మ్యాప్ ప్రకటన, ఆయన సీరియస్ నెస్, చెప్పిన వైనం, ఆ జర్నలిస్టు అంతే సీరియస్ చర్చను నడిపిన తీరుతో.. బీఆర్ఎస్ ఎంత సీరియస్ గా ఈ ప్రణాళికల విషయంలో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. రెండో సారి గెలిచిన తర్వాత కేసీఆర్ జాతీయంగా తన పార్టీని బలోపేతం చేసేందుకు చాలా చర్యలు తీసుకున్నారు. మూడో సారి గెలిచి ఉంటే.. ఈ పాటికి జగదీష్ రెడ్డి ప్లాన్ అమలు చేసేవారేమో కానీ.. ఓటమితో ఆగిపోయింది. ఈ సారి గెలిచిన తర్వాత ఇదే ప్లాన్ అమలు చేస్తారో.. ముందే చేస్తారో చూడాల్సి ఉంది.