చిన్ననాటి స్నేహితుడు గడికోట శ్రీకాంత్ రెడ్డికి జగన్ రెడ్డి నిలువుపోటు పొడుస్తున్నారు. రాయచోటి లో ఆయనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. సుగవాసి కుటుంబం నుంచి ఆయన కుమారుడు బాలసుబ్రహ్మణ్యాన్ని పార్టీలో చేర్చుకునేందుకు జగన్ రెడ్డి చర్చలు జరిపారు. రాయచోటి టిక్కెట్ ఖరారు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
సుగవాసి కుటుంబం బలమైన బలిజవర్గానికి చెందిన కుటుంబం. ఎప్పుడూ వైఎస్ కుటుంబానికి వ్యతిరేకమే. సుగవాశి పాలకొండ్రాయుడు విజయాలు సాధించినా ఆయన వారసులు ఎప్పుడూ గెలవలేదు. ఎన్నిసార్లు అవకాశం వచ్చినా విజయం దక్కలేదు. అయినా టీడీపీ అధినాయకత్వం ఆ కుటుంబానికి ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంది. గత ఎన్నికల్లో రాయచోటిలో సుగవాసి కుటుంబానికి సానుకూల పరిస్థితులు లేవని.. రాంప్రసాద్ రెడ్డికి చాన్సిచ్చారు. ఆయన విజయం సాధించారు. అయితే సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు రాజంపేట టిక్కెట్ ఇచ్చారు.
టీడీపీకి ఎంతో సానుకూలత ఉండే నియోజకవర్గంలో ఆయన విజయం సాధించలేకపోయారు. తనను టీడీపీ నేతలే ఓడించారని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇటీవల పాలకొండ్రాయుడు మరణించారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని జగన్ రెడ్డి ఆకర్షిస్తున్నారు. రాయచోటి టిక్కెట్ ఆఫర్ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు. అక్కడ ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఇక చాన్స్ లేనట్లే అనుకోవచ్చు. స్నేహితుడ్ని నమ్ముకుని శ్రీకాంత్ రెడ్డి రాజకీయ జీవితం రిస్క్ లో పడిపోతోంది.