ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పరిస్థితి విచిత్రంగా మారింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరో వైపు అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్ అనుసరిస్తున్న తీరు సొంత పార్టీ క్యాడర్లోనే తీవ్ర అసహనానికి దారితీస్తోంది. రాష్ట్రంలో కీలకమైన చర్చలు జరుగుతున్నప్పుడు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో జగన్ రెడ్డి ఏపీలో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితం కావడం ఆయన పలాయన వాదానికి నిదర్శనమని సొంత పార్టీ వారే తేల్చేస్తున్నారు.
ఆరోగ్యం సరిగా లేకపోయినా బొత్స పోరాటం
అధినేత లేని లోటును భర్తీ చేస్తూ, మండలిలో ప్రభుత్వాన్ని ఢీకొట్టడంలో బొత్స సత్యనారాయణ అసలైన ‘ఫైటర్’అనిపించుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరినప్పటికీ, కోలుకున్న వెంటనే నేరుగా సభకు వచ్చి అధికార పక్షంపై విరుచుకుపడటం బొత్సలోని రాజకీయ పట్టుదలను చాటిచెబుతోంది. ఒకవైపు వయసు, మరోవైపు అనారోగ్యం ఉన్నా సరే.. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఆయన చూపుతున్న చొరవ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ అయింది. అధినేత రారు.. సీనియర్ నేత అస్వస్థతలోనూ పోరాడుతున్నారు అనే చర్చ క్యాడర్లో బలంగా వినిపిస్తోంది.
పారిపోయే లీడర్‌ను చూసి క్యాడర్ ఏం నేర్చుకుంటారు?
అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేక, కూటమి సర్కార్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనో జగన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లిపోవడం ఆయన రాజకీయ చేతకానితనాన్ని’ సూచిస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన కనీస బాధ్యతను కూడా గాలికొదిలేసి, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కావడం కార్యకర్తలను నిరాశకు గురి చేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం దెబ్బలు తింటున్న వారు, కేసులపాలవుతున్న వారు.. తమ నాయకుడు ఇలా పారిపోతుంటే ఎవరి కోసం పోరాడాలని ప్రశ్నించుకుంటున్నారు. జగన్ లోపించిన ధైర్యం, బొత్సలో స్పష్టంగా కనిపిస్తుండటంతో నాయకత్వ మార్పు గురించిన అంతర్గత చర్చలు మొదలయ్యాయి.
పోరాడలేని నాయకత్వం ఎందుకు?
రాజకీయాల్లో ఓటమి సహజం, కానీ ఓటమి తర్వాత మైదానం విడిచి పారిపోవడం నాయకత్వ లక్షణం అనిపించుకోదు. జగన్ రెడ్డి ఒకవైపు బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటుంటే, బొత్స సత్యనారాయణ ఆసుపత్రి బెడ్ నుంచి వచ్చి సభలో గర్జిస్తున్నారు. ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీలో జగన్ పట్టు కోల్పోతున్నారనే సంకేతాలను ఇస్తున్నాయి. పార్టీ ఉనికిని కాపాడటానికి ఒక సీనియర్ నేత ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, వారసత్వంగా వచ్చిన అధికారాన్ని కాపాడుకోలేక జగన్ చేస్తున్న పలాయన ప్రదర్శన పార్టీని పాతాళానికి తొక్కేసే ప్రమాదం ఉంది.
