ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీవ్ర విమర్శలు చేశారు. నిజానికి జగన్ విమర్శలు చేయకపోతేనే ఆశ్చర్యపోవాలి తప్ప విమర్శిస్తే కాదు. ఈరోజు ఆయన గుంటూరు జిల్లాలో రెడ్డి గూడెం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి భాదిత రైతులని పరామర్శించారు. వారిని సమస్యల గురించి అడిగి తెలుసుకోవడానికి వెళ్ళిన ఆయన ఆ పని చేసివస్తే చాలా హుందాగా ఉండేది కానీ యధాప్రకారం ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఇదివరకు ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదని విమర్శించిన జగన్, ఈసారి ఆయన వరద ముంపుకి గురైన ప్రాంతాలని పరిశీలించడానికి హెలికాఫ్టర్ లో తిరిగినందుకు విమర్శలు చేశారు. “ఆయనకి ఎంతసేపు టీవీల్లో కనిపించడానికి హెలికాఫ్టర్లలో తిరుగుతుంటారు తప్ప, గ్రామాలలో పర్యటించి భాదిత రైతుల గోడు వినే ఆసక్తి, తీరిక లేవు. ఆయన హెలికాఫ్టర్లో గ్రామాలపై చక్కర్లు కొట్టి వెళ్ళిపోయిన తరువాతైనా రైతులని ఆదుకోవడానికి అధికారులు గ్రామాలలోకి రావడం లేదు,” అని స్థానిక సమస్య గురించి విమర్శలు గుప్పించిన తరువాత మళ్ళీ యధాప్రకారం ముఖ్యమంత్రి గురించి తాను రోజూ చేసే విమర్శలన్నీ మళ్ళీ వల్లె వేసి వెళ్ళిపోయారు. ఆయన తమ గ్రామాలకి ఎందుకు వచ్చారో తెలియక రైతులు తల గోక్కొన్నారు
భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలు బాగా దెబ్బ తిన్నాయి. అనేక గ్రామాలలో పంటలు ముంపుకి గురయ్యి చాలా నష్టం జరిగింది. ఈ సంగతి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలియదనుకోలేము. జిల్లాలో వరద ముంపుకి గురైన ప్రాంతాలన్నిటినీ ముఖ్యమంత్రి కాలినడకన తిరిగి పరిశీలించాలంటే 10 రోజులైన సరిపోదు. అందుకే ఇటువంటి పరిస్థితులలో ఏ ముఖ్యమంత్రి అయినా హెలికాఫ్టర్ లోనే వెళ్ళి అన్ని ప్రాంతాలని పరిశీలిస్తుంటారు. ఒకప్పుడు జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా అదే పని చేశారు. ఆ సంగతి జగన్ కి గుర్తులేనట్లుగా ముఖ్యమంత్రిని అర్ధరహితంగా విమర్శిస్తున్నారు. అయినా రైతుల కష్టాలు తెలుసుకోవడానికని వెళ్ళిన జగన్ వారి కష్టాలు, సమస్యలు తెలుసుకొని వీలైతే వారికి సహాయం చేయాలి. లేదా వారి సమస్యలని, వారికి కలిగిన నష్టం గురించి లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేసి వారిని ఆదుకోమని కోరవచ్చు. కానీ ఆ రెండు పనులు చేయకుండా ముఖ్యమంత్రిపై అర్ధరహితంగా విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.