జగన్ మోహన్ రెడ్డి రాజకీయ శైలి మరోసారి స్వయంకృతాపరాధంగా మారింది. దేశ రాజధానిలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు చేసిన నిరసనను ఖండిస్తూ జగన్ చేసిన ట్వీట్, అనూహ్యంగా ఆయనకే ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలోని బీజేపీ పెద్దల మెప్పు కోసమే ఆయన ఈ కపట సానుభూతి ప్రదర్శించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ట్వీట్ ద్వారా కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని, పరువును గంగలో కలపవద్దంటూ హితవులు అందుతున్నాయి. నిరసనల గురించి మాట్లాడే జగన్, గతంలో తాను చేసిన పనులను ఒక్కసారి నెమరువేసుకోవాలని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
పెట్టుబడుల విషయంలో జగన్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే, ఆయన విమర్శలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో అర్థమవుతుంది. 2017లో విశాఖలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను అడ్డుకోవడానికి స్వయంగా ఎయిర్‌పోర్టులోనే ధర్నాకు దిగిన చరిత్ర జగన్ ది. అధికారంలోకి రాగానే 2019లో అంతర్జాతీయ పెట్టుబడిదారులతో ఉన్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి వ్యవస్థలను అతలాకుతలం చేశారు. అంతేకాకుండా, సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంతో సాగాల్సిన అమరావతి ప్రాజెక్టును పక్కనబెట్టి రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చారు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి, నేడు దేశ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు.
గతంలోనే కాదు, ఇటీవలి కాలంలో కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నించారు. 2025లో ఏపీ ప్రభుత్వం నిధుల సమీకరణ చేయకుండా ఆర్బీఐ కి లేఖలు రాయడం, ప్రపంచబ్యాంకుకు ఈమెయిల్స్ పంపండ, ఇప్పుడు 2026లో ఏఐ సమ్మిట్ పట్ల నకిలీ ఆందోళన వ్యక్తం చేయడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. నారా లోకేష్ సహా అనేకమంది నేతలు జగన్ చేసిన ఈ ఆర్థిక విధ్వంసాన్ని సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. భారతదేశ పెట్టుబడి వాతావరణానికి అత్యధిక నష్టం కలిగించిన వ్యక్తే, నేడు నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడిపోయింది. సొంత చెల్లెలు షర్మిల నుంచి కాంగ్రెస్ అధిష్టానం వరకు అందరూ జగన్ వైఖరిని తప్పుబడుతున్నారు. సమాధానం చెప్పడానికి సరైన ఆధారాలు లేక వైసీపీ నేతలు మౌనం వహిస్తున్నా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దెబ్బతీసే జగన్ వ్యూహాలు, చివరకు ఆయనకే రాజకీయంగా నష్టం చేకూరుస్తున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
