వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు. అన్న వ్యూహకర్తలే చేయాలి. ఇప్పుడు వ్యూహకర్తలు లేరు. ఉన్నదల్లా ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఇస్తున్న సలహాలు, అమలు చేస్తున్న వ్యూహాలు అన్నీ జగన్ రెడ్డిని పూర్తిగా ముంచేస్తున్నాయి. ఎవరూ బయటకు లాగడానికి కూడా తీసుకురాని విధంగా చేస్తున్నాయి. ఇలాంటిదే నాంపల్లి కోర్టుకు ఓదార్పు యాత్ర తరహాలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించడం. వైసీపీ ప్లాన్ బయటకు వచ్చాక.. జన సమీకరణ ప్రయత్నాలు బహిర్గతమయ్యాక.. అందరూ పాపం జగన్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆ జన సమీకరణతో దండయాత్రగా వెళ్లబోతోంది న్యాయవ్యవస్థ మీదకు.
కోర్టుకు సైలెంట్ గా వెళ్లి రావడం పద్దతి
జగన్ రాజకీయ నాయకుడే. కానీ ఆయన చేసేది ప్రతీది రాజకీయం కాదు. రాజకీయ నేతలతోనే రాజకీయం చేయాలి. న్యాయవ్యవస్థతో అసలు రాజకీయం చేయకూడదు. కామన్సెన్స్ ఉన్న ఎవరూ చేయరు కూడా. కానీ జగన్ రెడ్డి తనకు కామన్ సెన్స్ కన్నా.. సిక్స్, సెవన్త్ సెన్స్ ఎక్కువ అనుకుంటారు.ఆయన తీరు తెలుసు కాబట్టే ఆయనకు తగ్గట్లుగా సలహాలిస్తూంటారు సజ్జల. దాన్ని అమలు చేస్తూంటారు. కోర్టుకు సైలెంట్ గా వెళ్లి వస్తేనే కోర్టును గౌరవించినట్లు. అలా కాకుండా.. కోర్టుకేదో..దండయాత్రకు వెళ్తున్నట్లుగా వందల మందిని వేసుకుని .. ట్రాఫిక్ కు అంతరాయం కల్పించి కోర్టు హాల్లో గందరగోళం సృష్టిస్తే.. ఇక నువ్ కోర్టుకు రావొద్దు అని కోర్టులు అనవు. అలా రావాల్సిన అవసరం లేకుండా చేస్తాయి. ఏం చేయాలో కోర్టులకు బాగా తెలుసు.
న్యాయవ్యవస్థపై ఇప్పటికే భయంకర దాడి
జగన్ రెడ్డి అధికారం అనుభవించిన ఐదేళ్ల పాటు చేయని అరాచకం లేదు. మిగతా వాటి సంగేతమో కానీ ఆయన నేరుగా న్యాయవ్యవస్థపై దాడి చేశారు. కాబోయే చీఫ్ జస్టిస్ కుటుంబసభ్యుల మీద తప్పుడు కేసులు పెట్టి, ఆయనపై తప్పుడు ఆరోపణలతో సీజేఐకే లేఖ రాశారు. అసలు పెట్టకూడని విధంగా మీడియా ముందు బయట పెట్టారు. అంటే నిరూపణ కాని ఆరోపణలను ప్రచారంలోకి తెచ్చి న్యాయవ్యవస్థ ప్రధాన పునాదిపైనే దాడి చేశారు. ఇది అప్పటికి పరిష్కారం అయి ఉంటుంది కానీ.. ఆ ఎఫెక్ట్ ఎప్పటికైనా కనిపిస్తుంది. చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. అది ఏ రూపంలో అనేది చెప్పలేం. అయినా ఇప్పటికీ న్యాయవ్యవస్థను ఏదో విధంగా బెదిరించాలని చూడటం.. అమాయకత్వమే.
కోర్టులు భయపడవు..ఈ విషయం గుర్తుంచుకోవాలి !
న్యాయవ్యవస్థలో నేరస్తులందరికీ ఒకే ట్రీట్ మెంట్ ఉంటుంది. నిందితులకు ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటివే ఇస్తారు. కానీ ఆ నిందితుడ్ని చూసి భయపడటం లేదా..ఆయన కోర్టుకు రావడం వల్ల తమ కార్యకలాపాలకు ఆటంకం అని కోర్టుకు రావొద్దని చెప్పవు. భారత దేశ ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ, జయలలిత వంటి వారే కోర్టుకు హాజరయ్యారు. సైలెంట్ గా వెళ్లి వచ్చారు. అంతే కానీ కోర్టుల్ని భయపెట్టి తాము రాకుండా చూసుకోవాలని అనుకోలేదు. అలా అనుకోవడం..ఘోరమైన మూర్ఖత్వం. జగన్ రెడ్డిది అదే. అందుకే ఆయన గురించి ఎవరూ బాధపడాల్సింది లేదు. పైగా ఆనందించవచ్చు కూడా.