జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఇప్పటి వరకూ వైఎస్ఆర్సిపి నాయకులు పరోక్ష వ్యాఖ్యలు చేసేవారు. రోజావంటి వారు అప్పుడప్పుడూ దెప్పి పొడుస్తుండేవారు. అంబటి రాంబాబు లాటివారికి దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వున్నాయి. సాక్షి ఛానల్లో కూడా వీలైనంత వరకూ విమర్శనాత్మకంగానే జనసేన చర్చలు జరుగుతుంటాయి. మార్చి 14న తమ పార్టీ మూడవ వార్షికోత్సవ సందర్భంగా పవన్ కళ్యాణ్ విధానపరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈ రోజు నేరుగా జగన్నే విలేకరులు ప్రశ్నించారు.వాస్తవానికి ఆయన బడ్జెట్‌పై విమర్శ కోసం మీడియాను కలిశారు. సుదీర్ఘంగా వివరించి ముగించారు. ఆ వెంటనే ఒక విలేకరి పవన్ కళ్యాణ్ విషయం ప్రశ్న వేశారు. ఇప్పుడు ఆ సంగతెందుకని అంటూనే జగన్ అనాల్సింది అనేశారు. పవన్ కళ్యాణే కాదు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా ఆప్యాయంగా ఆదరిస్తాం. కాని ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు చేస్తున్నారు అంటూ ముగించారు.ఒక్కమాటైనా సరే పవన్ వ్యక్తిత్వాన్ని స్వతంత్ర స్థానాన్ని గుర్తించడం లేదని ,ఆయన చంద్ర బాబు ఏజంటుగా వ్యవహరిస్తున్నారని జగన్ చెప్పేశారన్నమాట.