జ‌గన్ ప్ర‌చారంలో చంద్ర‌బాబు నామ‌స్మ‌ర‌ణే!

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా రోడ్ నిర్వ‌హించారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ ప్ర‌సంగం ఆద్యంతం చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డానికే స‌రిపోయింద‌ని అన‌డంలో ఎలాంటి సందేహం లేదు! ‘ఈరోజున నంద్యాల‌కు మంత్రులు వ‌స్తున్నారంటే, పెద్ద నాయ‌కులు వ‌స్తున్నారంటే అందుకు కార‌ణం ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుతూ ఉండ‌ట‌మే’ అన్నారు జ‌గ‌న్‌. ప్ర‌తిపక్ష పార్టీ త‌ర‌ఫున జ‌గ‌న్ పోటీ పెట్టాడు కాబ‌ట్టే వీళ్లంతా నంద్యాల‌కు వ‌స్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ ఎన్నిక‌ను ఏక‌గీవ్రంగా వ‌దిలేసి ఉంటే ఏ మంత్రీ ఇక్క‌డికి వ‌చ్చుండేవారు కాద‌నీ, ఒక్క రూపాయిని కూడా చంద్ర‌బాబు నాయుడు విదిల్చేవారు కాద‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.

లేనిపోని హామీల‌తో నంద్యాల‌ ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు మోసం చేయ‌బోతున్నార‌న్నారు జ‌గ‌న్‌. ఈ ఉప ఎన్నిక‌లో నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు వేసే ఓటు కేవ‌లం ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవ‌డం కోసం మాత్ర‌మే కాద‌నీ.. మూడున్న‌రేళ్ల చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌కు, చంద్ర‌బాబు నాయుడు అవినీతికి, చంద్ర‌బాబు నాయుడు అధ‌ర్మానికి, చంద్ర‌బాబు నాయుడు అన్యాయానికీ వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని జ‌గ‌న్ పిలుపు నిచ్చారు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మార్పున‌కు నంద్యాల నాంది ప‌ల‌కాల‌న్నారు. మూడున్నర సంవ‌త్ప‌రాల్లో చంద్ర‌బాబు నాయుడు మూడున్న‌ర ల‌క్ష‌ల కోట్లు అవినీతి సొమ్ము సంపాదించార‌నీ, అదే సొమ్ముతో వచ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు కొనేందుకు వ‌స్తార‌నీ, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌గ‌న్ అన్నారు. చంద్ర‌బాబు నాయుడుకు తీవ్రమైన‌ అహంకారం ఉంద‌నీ, డ‌బ్బుంది కాబ‌ట్టి ఎవ‌రినైనా కొన‌గ‌ల‌ను, ఏదైనా చేయ‌గ‌ల‌ను అనే స్థాయిలో ఉన్నార‌న్నారు. చంద్ర‌బాబు మాదిరిగా త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులేద‌నీ, ముఖ్య‌మంత్రి ప‌ద‌వి లేద‌నీ, ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమాన‌మే త‌న‌కు బ‌ల‌మ‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్ ప్ర‌సంగంలో చంద్ర‌బాబు నామ‌స్మ‌ర‌ణే ఎక్కువ‌గా వినిపించింది! చంద్ర‌బాబును విమ‌ర్శిస్తే చాలు, నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం అయిపోయిన‌ట్టే అని వైకాపా భావిస్తున్న‌ట్టుగా ఉంది. ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ విమ‌ర్శించ‌డం అనేది కొంతవ‌ర‌కూ స‌మ‌ర్థ‌నీయ‌మే. ఎన్నిక‌ల ప్ర‌చారం అనేస‌రికి ఇలాంటి స‌ర్వ సాధార‌ణ‌మే. కానీ, ప్ర‌తిప‌క్ష పార్టీగా తామేం చేశామో, నంద్యాల ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌బోతున్నామో కూడా మ‌ధ్య‌లో చెబితే కొంత బాగుండేది. గ‌డ‌చిన మూడున్న‌రేళ్లుగా చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌లు విసుగు చెందార‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. అంటే, టీడీపీకి వ్య‌తిరేకంగా మాత్ర‌మే ఓటెయ్యాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు.

ఇదే స‌మ‌యంలో మూడున్న‌రేళ్ల‌లో ప్ర‌తిప‌క్షం సాధించింది ఏంట‌నేది కూడా చెప్తే బాగుంటుంది. ప్ర‌తిప‌క్షంగా వైకాపా సాగించిన పోరాటాలు, ప్ర‌జ‌ల కోసం ప‌డిన త‌ప‌న అనేవి చెబితే ఇంకా బాగుంటుంది. చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త కోస‌మే వేచి చూస్తున్నారే త‌ప్ప‌.. వైకాపా సానుకూల‌త‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌లేక‌పోతున్న‌ట్టుగా ఉంది! చంద్ర‌బాబు వ్య‌తిరేక‌తే వైకాపా బ‌లం అన్న‌ట్టుగా ఉంది. త‌మ‌కంటూ సొంతంగా ఉన్న బ‌లాల‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్న‌ట్టుగా ఉంది! 2019 మ‌హా కురుక్షేత్రానికి నంద్యాల నాంది అనుకుంటే.. ఇదే పోరాట ప‌టిమ ఆ కురుక్షేత్రంలో స‌రిపోతుందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com