జగన్ రెడ్డి వచ్చే వారం మూడు రోజుల షో చేసి యూరప్ వెళ్లబోతున్నారు. ఒక రోజు పార్టీ నేతల సమావేశంలో పాత స్క్రిప్ట్ చదవనున్నారు. మరో రోజు ఓ పెళ్లికి వెళ్లి సీఎం సీఎం నినాదాలు చేయించుకోనున్నారు. మరో రోజు అనకాపల్లిలో తాను కట్టేశానని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజీని చూసి రానున్నారు. ఆ తర్వాత యూరప్ పర్యటనకు వెళ్తారు. నెలాఖరులోనే వస్తారు. అయితే ఈ సారి ఆయన పర్యటనలో ఉండగా ఎంత మంది ఎంపీలు రాజీనామా చేయబోతున్నారు అనే చర్చ ప్రారంభమయింది.
గతంలో ఆయన ఓ సారి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. అంతకు ముందు ఇద్దరు ఎంపీలు అలాగే రాజీనామా చేశారు. ఈ సారి యూరప్ పర్యటనకు వెళ్తూంటే ఎవరు గుడ్ బై చెప్పబోతున్నారన్న గుసగుసలు అందుకే ప్రారంభమయ్యాయి. రాంకీ సంస్థల యజమాని.. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి పై గతంలోనే ప్రచారం జరిగింది. కానీ ఆగిపోయారు. పెద్దగా ఖండించలేదు. అలాగే మరో ఇద్దరు ఎంపీలపైనా అనుమానాలు ఉన్నాయి.
తన పార్టీ నేతల్ని జగన్ రెడ్డే బీజేపీలోకి పంపుతున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. బీజేపీ దగ్గర నుంచి వ్యక్తిగతంగా ప్రయోజనాలు పొంది.. ఇలా ఎంపీలను ఆ పార్టీలోకి పంపుతున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. జగన్ దేశంలో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు చేయాల్సిన రాజకీయాలు చేస్తారు. అందుకే.. ఖచ్చితంగా కొన్ని కీలక పరిణామాలు ఉంటాయని మాత్రం గట్టిగా నమ్ముతున్నారు.