హిందూపురం నియోజకవర్గంలో కాంగ్రెస్, వైసీపీ తరపున కీలక నేతగా ఉండి.. సంపాదించినదంతా ఖర్చు పెట్టుకున్న నవీన్ నిశ్చల్ ను జగన్ చివరికి పార్టీ నుంచి గెంటేశారు. ఆయన అడ్డం అవుతున్నారని గత ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన దీపికారెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆయన ప్రెస్ మీట్ పెట్టి బోరుమన్నారు. ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారని.. కానీ తనను మాత్రం వివరణ అడగకుండానే పార్టీని సస్పెండ్ చేశారన్నారు. వైఎస్ హయాం నుంచి తాను హిందూపురంలో పోరాడుతున్నానని గుర్తు చేశారు. పోటీ చేసినప్పుడల్లా స్వల్ప తేడాతో ఓడిపోయినా తర్వాత అవకాశాలు ఇవ్వలేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పార్టీలో చేరితే.. .మొదటి సారి బాలకృష్ణపై కేవలం 9వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని తర్వాత తనకు చాన్స్ ఇవ్వకుండా ఇతరులకు ఇస్తే 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు. అయినా వారి కోసం తాను పని చేశానన్నారు.
పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తే వారి కోసం పని చేశానన్నారు. ఇప్పుడు తనకు ఎక్కడా అవకాశాలు ఉండవని.. సస్పెండ్ చేసినా తాను వైసీపీ కోసమే పని చేస్తానన్నారు. జగన్ కు అభిమానంగానే ఉంటానని.. కొద్ది రోజులకు అయినా తన గురించి జగన్ నిజాలు తెలుసుకుంటారని చెప్పుకున్నారు. నవీన్ నిశ్చల్.. వైఎస్ అనుచరుడు. హిందూపురంలో పలుమార్లు పోటీ చేసే అవకాశం కల్పించారు. వైసీపీలో చేరాక ఒక్క అవకాశం కల్పించారు. కానీ తర్వాత ప్రతీ సారి కొత్త వారిని తీసుకు వచ్చారు. దాంతో హిందూపురంలో వర్గ పోరాటం పెరిగిపోయింది.
హిందూపురం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంతో పాటు హిందూపురంలోనే నోట్ల కట్టల వరద పారించాడు. కానీ బాలకృష్ణ మెజార్టీ పెరిగింది.