ప్రత్యేక హోదా అనే మాటను తెలుగుదేశం పార్టీ ఎప్పుడో వదిలేసింది! కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన రోజునే… అదే మహాప్రసాదం అనుకుని కళ్లకద్దుకుని కామ్‌గా ఉండిపోయింది. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కినా, ప్రత్యేక హోదా ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య అని ప్రజలు ఆగ్రహిస్తున్నా ఏమీ పట్టినట్టు కూర్చుంది! పైగా, హోదా కంటే ఆ ప్యాకేజీ ఎంత గొప్పదో చాటి చెప్పే పనిని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు భుజాన వేసుకుని, చంద్రబాబు ఫెయిల్యూర్‌ను బాగానే కవర్ చేశారు! ప్రతిపక్ష వైకాపా మాత్రం ప్రత్యేక హోదాపై పోరాటం కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఇన్నాళ్లూ జగన్ సభలపై తెలుగుదేశం నేతలు పెద్దగా స్పందించింది లేదు. జగన్ పెడుతున్న యువభేరి సభలకు పిల్లల్ని పంపించొద్దని ఆ మధ్య కొంతమంది మంత్రులు విమర్శించారు. అలా వెళ్తే కేసులు పెడతామన్నట్టు కూడా హెచ్చరించారు! ఇప్పుడు జగన్ చేస్తున్న పోరాటంపై కొత్త విమర్శలకు పదును పెడుతున్నారు తెలుగుదేశం నేతలు.
సభలూ ధర్నాల పేరుతో ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారంటూ ఆరోపించారు నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమ. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే ఆయన ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయాలనీ, అంతేగానీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తా అనడం సరైంది కాదన్నారు. ఈ పోరాటం వెనక జగన్ కుట్ర వేరే ఉందనీ.. తరుముకొస్తున్న కేసుల విచారణ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ఉద్యమాలు చేపడుతున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి స్క్రిప్ట్ రాసి ఇస్తే, దాన్ని సభల్లో జగన్ చదువుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, హాయిగా విశ్రాంతి తీసుకుంటూ సభలు నిర్వహిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా జగన్‌పై మండిపడ్డారు. రాజీనామాల పేరుతో ఎంపీలను బలిచేయడం ఎందుకని ఆయన అన్నారు. రాజీనామాలు అంటే వైకాపా ఎంపీలు భయపడిపోతున్నారనీ, ఇప్పటికే ఇద్దరు పారిపోయారనీ, ఎంతో కష్టపడి వారు ఎంపీలుగా గెలిచారని అన్నారు. ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆయన ఓ పాయింట్ తీశారు.
సరే, ప్రతిపక్ష నేత ప్రత్యేక హోదా పోరాటాన్ని కాసేపు పక్కన పెడదాం! ఇంతకీ, ప్యాకేజీతో సర్దుకుపోవాల్సిన అవస్థ తెలుగుదేశం సర్కారుకు ఎందుకొచ్చింది..? హోదాపై కేంద్రం మెడలు వంచుదామని, ఇచ్చేవరకూ పోరాటం సాగిద్దామని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్యాకేజీ రాగానే ఎందుకు సైలెంట్ అయిపోయారు..? ఈరోజే కాదు, మొదట్నుంచి కూడా ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవడం తెలుగుదేశం సర్కారు ఘోరంగా విఫలమైంది. భాజపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ కేంద్రంపై రాష్ట్ర సర్కారు ఒత్తిడి పెంచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ప్రత్యేక హోదా రాలేదన్న బాధ ఆంధ్రుల్లో లేదని మాత్రం ఎవరూ చెప్పలేం! ఈ విషయంలో చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని కూడా ప్రజలు గుర్తించలేదని ఏలికలు భావిస్తే అది భ్రమే అవుతుంది. ఇక, జగన్ పోరాటం కేంద్రంపై ఒత్తిడి పెంచుతుందా లేదా అనేది ప్రజల చేతుల్లోనే ఉంది! జగన్ ఉద్యమం ప్రజా పోరాటం అయితే ప్రయోజనం ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.