జగన్ రెడ్డి తన అజ్ఞానం టీడీపీ సమస్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అమలవుతున్న పథకాలను అమలు కావడం లేదని ట్వీట్లు పెడుతున్నారు. ఆయన తీరుతో వైసీపీ నేతల్లోనూ గందరగోళం ఏర్పడుతోంది. తల్లికి వందనం, రైతు భరోసా, ఉచిత బస్సు లాంటి పథకాలు అమలవుతూంటే.. అవేమీ అమలు చేయడం లేదని.. ఎప్పట్నుంచి ఇస్తారని ఆయన దీపావళి సందర్భంగా ప్రశ్నించారు. ఆ ట్వీట్ చూసి.. వైసీపీ నేతలకూ మైండ్ బ్లాంక్ అయిపోతోంది.
జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనను ముగించుకుని తిరిగి వస్తున్నట్లుగా అబ్బయ్య చౌదరి లాంటి వైసీపీ నేతలు పోస్టులు పెట్టారు. అవి ఎప్పటి ఫోటోలో ఎవరికీ తెలియవు. కానీ ఆయన తిరిగి వస్తున్నారని లీక్ మాత్రం అలా ఇచ్చారని అనుకోవచ్చు . రాగానే ప్రభుత్వంపై ఏ ఏడుపు ట్వీట్ పెట్టేశారు..
మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా వెలిగిందా అని ప్రశ్నించారు.
నిరుద్యోగ భృతి, మహిళలకు ఇస్తామన్న నెల నెలా రూ.1500, 50 ఏళ్లకే పెన్షన్. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, బస్సులో ఉచిత ప్రయాణం, ఉద్యోగుల వాగ్దానాలు అంటూ ఎనిమిది అంశాలపై ప్రశ్నించారు. అందులో నిరుద్యోగభృతి, మహిళలకు రూ.1500 తప్ప అన్నీ అమలవుతున్నాయి. కానీ ఆయన కాలేదనుకుంటున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పారని చెప్పుకోవడం. జగన్ రెడ్డి తాను అంత వెలుగులు ఇచ్చినట్లయితే కనీసం ఆయనకు హోదా అయినా ప్రజలు ఇచ్చి ఉండేవారన్న సంగతిని మర్చిపోతున్నారు. తన పాలన ఇంకా అద్భుతమన్న భ్రమల్లోనే ఉండిపోతున్నారని ఇలాంటి ట్వీట్లు అప్పుడప్పుడూ నిరూపిస్తూ ఉంటాయి.