వైసీపీ అధినేత జగన్ బయట కనిపించి చాలా కాలం అయింది. పులివెందుల జడ్పీటీసీ ఫలితాలు వచ్చిన రోజున అనంతపురంలో ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడ్నుంచి యలహంక చేరుకున్నారు. అప్పట్నుంచి ఆయన హాట్ లైన్స్ కలుపుకునే పనిలో బిజీగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు వైపు బీజేపీ.. ఇటు వైపు కాంగ్రెస్ రెండు పార్టీలతోనూ ఆయన హాట్ లైన్స్ కలుపుకునే పనిలో ఉన్నారు. ఒకరి కి తెలియకుండా.. మరొకరితో మ్యానేజ్ చేయడం కష్టమైనా.. తనకు తప్పదన్నట్లుగా ఆయన ప్రయత్నిస్తున్నారు.
బీజేపీతో వన్ సైడ్ హాట్ లైన్
భారతీయ జనతా పార్టీతో తప్పనిసరిగా వన్ సైడ్ హాట్ లైన్ నడుపుతున్నారు. అటువైపు నుంచి స్పందన ఉన్నా లేకున్నా బీజేపీ వెంటే తిరుగుతున్నారు. ఎన్డీఏ కూటమి తనకు ప్రత్యర్థి అని భావించడం లేదు. ముందుగా తాను జైలుకు వెళ్లకుండా ఉంటేనే తర్వాతే ఏదైనా రాజకీయం అని అనుకుంటున్నారు. అందుకే బీజేపీని వదిలి పెట్టడం లేదు. పట్టుకునే ఉంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిర్మోహమాటంగా మద్దతు పలికారు. కానీ బీజేపీ ఆయనను పట్టించుకునే పరిస్థితి లేదని అర్థం కావడంతో డబుల్ గేమ్ ప్రారంభించారు.
కాంగ్రెస్తో హాట్ లైన్ కోసం దరఖాస్తు
కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డిని పంపించారు. ఖర్గేతో చర్చించారు. ఇది బయటకు తెలిసింది.కానీ బయటకు తెలియకుండా యలహంక నుంచి చక్కబెడుతున్న కార్కక్రమాల్లో జగన్ స్వయంగా పాలు పంచుకుంటున్నారు. బీజేపీతో అంటి పెట్టుకుని ఉంటే.. నిర్వీర్యం అయిపోతామని.. తర్వాత అయినా కాంగ్రెస్ పక్కన చేరాల్సిందేనని ఆయన అనుకుంటున్నారు. అందుకే… హాట్ లైన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఎంత వరకు ఎంటర్టెయిన్ చేస్తుందన్నది చూడాల్సి ఉంది.
గోడ మీద పిల్లి రాజకీయాలు !
జగన్ రెడ్డి ని ఫ్యాన్స్ పులి అంటూంటారు ..సోనియాను ఎదిరించారు.. మోదీని ధిక్కరించారని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ జరుగుతోంది వేరు. ఆయన గోడ మీద పిల్లి తరహా రాజకీయాలు చేస్తున్నారు. అదే తన విశ్వసనీయత అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ జగన్ రెడ్డి రాజకీయాలు చూసి.. సామాన్య ప్రజలు కూడా.. ఇలా ఎలా అనుకోవాల్సి వస్తుంది. రెండు హాట్ లైన్స్ కోసం ప్రయత్నిస్తున్న జగన్ కు.. ఏ లైనూ దొరికే చాన్స్ లేదని భావిస్తున్నారు.