ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థలకు అత్యున్నత గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే తాము ప్రజాజీవితంలో ఉన్నామంటే దానికి కారణం రాజ్యాంగ వ్యవస్థలే. కానీ వాటిని తేలికగా తీసుకునే నేతలు పెరిగిపోయారు. వారి రాజకీయ జీవితం స్వల్పకాలమే ఉంటుంది. కానీ అది అయిపోయాక కానీ చాలా మందికి అర్థం కావడంలేదు. ఇలాంటి వారిలో జగన్మోహన్ రెడ్డి ముందు ఉంటారు. అదే సమయంలో వ్యవస్థల్ని అత్యంత గౌరవించే నారా లోకేష్ ముందు ఉంటారు. ఒకరు కోర్టు మెట్లు ఎక్కడానికి రకరకాల కారణాలతో మినహాయింపులు కోరుతుంటే, మరొకరు స్వచ్ఛందంగా హాజరవుతూ వ్యవస్థల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారు.
కోర్టులంటే గౌరవం లేని జగన్
న్యాయవ్యవస్థ లోకేష్ , జగన్ దృక్పథంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. వైఎస్ జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు కావచ్చు, లేదా తాను బాధితుడిగా ఉన్న కోడికత్తి కేసు కావచ్చు.. కోర్టుకు హాజరుకావడానికి ఎప్పుడూ విముఖత చూపుతూనే వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రతా కారణాలు, పాలనాపరమైన బిజీ అని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం చర్చనీయాంశమైంది. దీనికి భిన్నంగా, నారా లోకేష్ తన ప్రతిష్టకు భంగం కలిగించిన సాక్షి కథనంపై తానే స్వయంగా కోర్టును ఆశ్రయించి, ఏళ్ల తరబడి ఓపికగా ప్రతి వాయిదాకు హాజరవుతున్నారు. ఒక సామాన్య పౌరుడిలా న్యాయం కోసం వేచి చూడటం ఆయనకు వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది.
బాధితుడిగా ఉండి కూడా దూరం.. జగన్ వింత పోకడ
సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో జగన్ బాధితుడు . సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రావాలని ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా, ఆయన రకరకాల సాకులు చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. బాధితుడే న్యాయస్థానానికి రాకపోవడం వల్ల విచారణ ఆలస్యమవుతోందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. న్యాయవ్యవస్థను గౌరవించే నేత ఎవరైనా సత్వర న్యాయం కోసం కోర్టుకు సహకరిస్తారు. కానీ, జగన్ వ్యవహారశైలి చూస్తుంటే, ఆయనకు వ్యవస్థల కంటే తన రాజకీయ అవసరాలే ముఖ్యమన్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఒక బాధ్యతాయుతమైన నాయకుడికి ఉండకూడని లక్షణమని విమర్శకులు అంటున్నారు.
లోకేష్ న్యాయపోరాటం: ఓర్పుకు నిదర్శనం
లోకేష్ తనపై వచ్చిన ఆరోపణలను కేవలం ప్రెస్ మీట్లతో ఖండించి వదిలేయలేదు. తనపై తప్పుడు వార్త రాసిన పత్రికను న్యాయస్థానంలో నిలదీశారు. ఇందుకోసం ఆయన తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి విశాఖ కోర్టుకు పదేపదే హాజరవుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నమ్మడమే కాకుండా, ఆ ప్రక్రియలో తాను కూడా భాగస్వామి అవుతున్నారు. తప్పు చేసిన వారు శిక్ష పడే వరకు వదిలిపెట్టకూడదనే ఆయన పట్టుదల, చట్టబద్ధమైన పాలన పట్ల ఆయనకు ఉన్న కట్టుబాటును చాటిచెబుతోంది. ఈ విషయంలో జగన్ కన్నా లోకేష్ ఎంతో పరిణతి చెందిన నాయకుడిగా కనిపిస్తున్నారు.
రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణం ప్రజలకు ఆదర్శంగా ఉండటం. చట్టం నుంచి తప్పించుకోవాలని చూసే నాయకుడి కంటే, చట్టం ముందు వినమ్రంగా నిలబడి తన నీతిని నిరూపించుకునే నాయకుడికే ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. లోకేష్ అనుసరిస్తున్న ఈ లా సెంట్రిక్ విధానం ఆయన గ్రాఫ్‌ను పెంచుతుండగా, కోర్టులకు దూరంగా ఉండాలని చూసే జగన్ తీరు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉంది. వ్యవస్థలను గౌరవించే విషయంలో లోకేష్ అనుసరిస్తున్న వ్యూహం, ఆయనను ఒక బాధ్యతాయుతమైన భవిష్యత్ నేతగా నిలబెడుతోంది.
