రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవిధంగానయినా మాట్లాడగలవు. ఎటువంటి డిమాండ్స్ అయినా చేయగలవు. ఏదో సాకుతో బందులు, ధర్నాలు చేయగలవు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలంటే ఆవిధంగానే ప్రవర్తించాలనే ఒక నిశ్చిత దురభిప్రాయం ప్రజలలో కూడా ఏర్పడిపోయింది. ఐదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల వరకు పార్టీ ఉనికిని, పార్టీలో నేతలని కార్యకర్తలను కాపాడుకొనేందుకు ప్రతిపక్షపార్టీలు ప్రజా సమస్యల పేరిట ప్రభుత్వంతో పోరాడుతుంటాయి. వాటి ఉద్దేశ్యం ఏదయినప్పటికీ అవి చేసే పోరాటాలు అధికారమనే మత్తగజానికి అంకుశంలా ఉంటుంది కనుక ప్రజలు కూడా వాటిని ఆమోదిస్తున్నారని భావించవచ్చును.
రెండు వారాల్లోగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే, 16వ తేదీ నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని జగన్ నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. కానీ 15నెలల్లో కానిది 15 రోజుల్లో సాధ్యమవుతుందా అంటే అసాధ్యమనే అర్ధం అవుతుంది. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ గడువు పెట్టడం చూస్తే ఆయన ప్రత్యేక పోరాటం ప్రత్యేక హోదా కోసమో లేక కేంద్రం మీదనో కాదనే సంగతి స్పష్టం అవుతోంది. కేంద్రంతో పోరాడి సాధించాల్సిన ఈ అంశాన్ని పట్టుకొని ఆయన చంద్రబాబు నాయుడుతో పోరాడాలనుకోవడం, ఇద్దరు కేంద్ర మంత్రుల్ని తక్షణమే ఉపసంహరించుకోమని పదేపదే ఒత్తిడి చేస్తుండటం గమనిస్తే ఆయన తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు నాయుడుతోనే పోరాడుతున్నట్లు స్పష్టం అవుతోంది. బహుశః అందుకే తెరాస ఎంపీ కవిత ఆ పోరాటానికి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రత్యేక పోరాటాల స్పీడు తగ్గించుకొన్నట్లుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలనుకొంటే ఎవరూ అభ్యంతరం చెప్పబోరు. కానీ ఆ పేరుతో ఈవిధంగా రాజకీయ పోరాటాలు చేస్తేనే ప్రజలు దూరం అవుతారు.