విజయవాడలో ప్రైవేటు ల్యాండ్స్ వివాదంలో బాధితుల వద్దకు వెళ్లిన జగన్ రెడ్డి సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అందులో ఏముందని.. ఏ విషయంలో విచారణ జరగాలని ఆయన సీబీఐని డిమాండ్ చేస్తున్నారో ఆయనకే తెలియాలి. అలాంటి భూవివాదాలు బోలెడన్ని ఉన్నాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే జగన్ హయాంలోనే ఆ వివాదం కోర్టుకెళ్లింది. మరి అప్పుడు ఇదేమి పెద్దగా అనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చి సీబీఐ అంటున్నారు. కానీ ముందుగా ఆయన సీబీఐపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. ఆ తర్వాత ఆ మాట చెబితే చాలా మంది స్వాగతించేవాళ్లు.
కల్తీ నెయ్యి కేసులో సీబీఐ దర్యాప్తును ఎందుకు అంగీకరించడం లేదు?
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో.. కల్తీ నెయ్యిపై విచారణ జరుగుతోంది. ఆ సంస్థ సంచలన విషయాలను బయటపెడుతోంది. దర్యాప్తులో ప్రతి విషయం విపులంగా వివరిస్తోంది. అసలు నెయ్యే కాని నెయ్యిని ప్రసాదం తయారీకి ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని బయటపెడుతోంది. కానీ ఈ విచారణపై జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ నందలేస్తోంది. విచారణపై తమకు నమ్మకం లేదంటోంది. దర్యాప్తు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రెడ్డి అయితే ఓ దర్యాప్తు అధికారిని పట్టుకుని వాడూ..వీడూ అని కూడా అంటున్నారు.
వివేకా హత్యకేసులో సీబీఐపైనే కేసులు పెట్టిన ఘనత
వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టించారు జగన్. తప్పుడు కేసులు పెట్టించినట్లుగా సుప్రీంకోర్టు తేల్చింది. అధికార దుర్వినియోగం చేశారని తేల్చింది. సీబీఐ దర్యాప్తును ప్రతి రోజూ అడ్డుకుంటూ ఆ సంస్థపై చేయని ఆరోపణలు లేవు. నిజాలు బయటపెడుతూంటే.. అలా చేయకూడదని ఈ దాడి చేశారు. అప్పట్లో నమ్మకం లేని సీబీఐని ఇప్పుడు ఎందుకు రాజకీయ డిమాండ్లకు ఉపయోగించుకుంటున్నారు?
అక్రమాస్తులకేసులో సీబీఐని పొగుడుతారా?
జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్ని కూడా సీబీఐనే హ్యాండిల్ చేసింది. అన్ని ఆధారాలతో కోర్టుల ముందు పెట్టింది. ట్రయల్ ప్రారంభం కాకుండా.. పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ టైం పాస్ చేస్తున్నారు. కోర్టు సమయాన్ని వృధా చేస్తూ తాము బెయిల్ పై బయట గడిపేస్తున్నారు.సీబీఐపై అంత నమ్మకం ఉంటే.. ముందు ఇలాంటి కేసుల్లోఆ సంస్త పనితీరును మెచ్చుకోవాలి. కానీ జగన్ రెడ్డి మాత్రం తన నేరాల్లో సీబీఐ పని చేయకూడదని..చేసినా తనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అప్పుడే సీబీఐ మంచిది.లేకపోతే చెడ్డది. అదే సమయంలో రాజకీయ అవసరాల కోసం సీబీఐని తెగ వాడేస్తారు.
