“సిద్ధాంతం లేని రాజకీయం… పునాది లేని భవనం లాంటిది. పూటకో మాట మార్చే నాయకుడు ప్రజల నమ్మకాన్ని మాత్రమే కాదు, తన గౌరవాన్ని కూడా కోల్పోతాడు.”
విలువల్లేని రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి మహాత్మాగాంధీ చెప్పిన అనేక విషయాల్లో ఈ సూక్తి ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. సిద్ధాంతం లేని రాజకీయం… పునాది లేని భవనం తాత్కలికంగా నిలబడవచ్చు కానీ.. కూలిపోవడానికి ఎంతో కాలం పట్టదు. పూటకో మాట మార్చే నాయకుడు ప్రజల నమ్మకాన్ని మాత్రమే కాదు, తన గౌరవాన్ని కూడా కోల్పోతాడనేది ఇప్పుడు మన కళ్ల ముందే ఉంది. ఆ ఉదాహరణ ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి. రాజధాని అమరావతిపై తాజాగా ఆయన మడతేసిన నాలుకను చూసి ఆయనను అభిమానించేవారు కూడా .. అలా అభిమానించినందుకు తమను తాము అసహ్యించుకుని ఉంటారు. ఎందుకంటే జగన్ రెడ్డి అమరావతి విషయంలో ప్రజల్ని ఎన్ని సార్లు మోసం చేశారో.. ఎన్ని సార్లు మాట మార్చారో లెక్కించడం కష్టమే.
నదీగర్భం పేరుతో అమరావతిపై కొత్తకుట్రలు
అమరావతిలో నివాసం ఉంటూ అమరావతిపై విషం కక్కే జగన్ రెడ్డి కొత్తగా అమరావతి గురించి ప్రవచించిన వ్యతిరేకత నదీగర్భం. అమరావతిని నదీ గర్భంలో కడుతున్నారట. ఆయన ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో బతుకతూ ప్రజలందర్నీ అందులోకి తీసుకెళ్లి..తాను ఒక్కడ్నే అలాంటి ప్రపంచాన్ని ఏలాలనుకుంటారు?. నదీగర్భం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. నదీ తీరం అంటే ఏమిటో ఆయనకు తెలియదు.కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు రాసిచ్చినవి చదివేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ పై నాలుగు రాళ్లేసి వెళ్లిపోయారు. నదీగర్భం అని ఆయనకు ఇప్పుడే తెలిసిందా?. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే అది నదీగర్భం కాదు. కానీ ఆ పేరుతో సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్లు వేయబోతున్నారని హింటిచ్చారన్నమాట. సుప్రీంకోర్టు ప్రస్తావన కూడా ఆయన తీసుకు వచ్చారు. అంటే అమరావతికి అడ్డం పడటానికి వ్యవస్థల వద్దకు వెళ్తున్నానని ఆయన చెబుతున్నారన్నమాట. అమరావతికి ఇప్పటికే ఎన్జీటీ సహా అన్ని అనుమతులు వచ్చాయి. ఆ విషయం తెలిసినా సరే జగన్ తన మూర్ఖమైన మార్గంలోనే వెళ్తున్నారు.
అమరావతిపై ఎప్పుడూ విషం కక్కడమే పని !
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఏపీకి ఓ రాజధానిని సృష్టించేందుకు.. మదగజాల్లాంటి రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక,తమిళనాడులకు మధ్య నలిగిపోకుండా.. ఓ బలమైన , ఆర్థిక వ్యవస్థకు అండగా నిలబడే రాజధాని కావాలని చంద్రబాబు అమరావతిని సంకల్పించారు. కానీ జగన్ ఏపీ భవిష్యత్ తో ఆడుకుంటూనే ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పీక నొక్కి ఆయనే ప్రధాన నేతగా ఎదగడంతోనే శని ప్రారంభమయింది. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో అమరావతి రాజధాని ఒక చిక్కుముడి అయితే, ఆ ముడిని మరింత బిగించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు ప్రధాన పాత్ర పోషించాయి. గత పదేళ్లుగా ఈ అంశంపై ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండటం ఆయన రాజకీయ విశ్వసనీయత ను తీవ్రంగా దెబ్బతీయడం మాత్రమే కాదు.. ఏపీ ప్రజలకు తీరని నష్టం చేశాయి.
భూములిచ్చిన రైతులకు ఐదేళ్ల పాటు హింస
రాష్ట్ర విభజన తర్వాత 2014లో అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు, అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీ సాక్షిగా దానికి పూర్తి మద్దతు ప్రకటించారు. రాజధాని కనీసం 30 వేల ఎకరాల్లో ఉండాలి, లేకపోతే అది నగరం అనిపించుకోదు అని ఆనాడు ఆయనే స్వయంగా చెప్పారు. నిజానికి అంతకు ముందే అంటే ఎన్నికలకు ముందే ఆయన తన విజన్ అంటూ ప్రజల ముందు ఆవిష్కరించిన రాజధాని గురించి కూడా ఇదే చెప్పారు. నదీ తీరంలో 30వేలకుపైగా ఎకరాల్లో రాజధాని ఉండాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి భూసమీకరణ చేసి పట్టాలెక్కించింది. కానీ, 2019లో అధికారంలోకి రాగానే అదే భూసేకరణను ఇన్ సైడర్ ట్రేడింగ్ అని విమర్శించడం, రాజధాని ప్రాంతాన్ని ఒక సామాజిక వర్గానికి చెందినదిగా చిత్రించడం ద్వారా తన రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారంలో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాను.. చంద్రబాబు కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తాను అని స్థానిక రైతులకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. అయితే గెలిచిన కొద్ది నెలలకే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట మొదలుపెట్టారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను రోడ్డున పడేసి, వారి ఉద్యమాన్ని హేళన చేస్తూ, ఐదేళ్ల పాటు అటు అమరావతిని ఇటు విశాఖను అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు.
పాతాళంలోకి పడిపోయినా అవే కుట్రలు
2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై దారుణమైన ఓటమిని చవిచూసిన తర్వాత జగన్ మళ్ళీ తన పంథాను మార్చుకున్నారు. ప్రజాగ్రహం అమరావతిపై తన వైఖరి వల్లేనని గుర్తించి, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, దాన్నే రాజధానిగా కొనసాగిస్తాం అంటూ కొత్త రాగం అందుకున్నారు. కానీ అది కూడా ఎంతో కాలం లేదు. ఇప్పుడు మళ్లీ మాట మార్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో, జగన్ మళ్ళీ పాత విమర్శలనే కొత్త రూపంలో తెరపైకి తెచ్చారు. రాజధానిని నదీగర్భంలో కడుతున్నారని, ఇది వరద ముప్పు ఉన్న ప్రాంతమని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం పనులను అడ్డుకోవడానికేనని స్పష్టమవుతోంది. ఆయన అదే ప్రాంతంలో ఇల్లు కట్టుకుని నివసించినప్పుడు లేని ముప్పు, ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటేనే గుర్తుకు రావడం ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. ఒక విధానం లేకుండా కేవలం చంద్రబాబును వ్యతిరేకించడమే లక్ష్యంగా ఆయన మాట మారుస్తున్నారు. రాజధానికి చట్టబద్ధత వచ్చే క్రమంలో..రెండో విడత భూసేకరణకు ముందుకు రాకుండా రైతుల్ని ఆపేందుకు ఈ కుట్రలకు పాల్పడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై ఇన్నిసార్లు మాట మార్చడం ప్రజాస్వామ్యంలో అరుదైన విషయం. ఒకసారి ఒప్పు మరోసారి తప్పు , ఇంకోసారి మూడు ముక్కలు , ఇప్పుడు నదీగర్భం .. ఇలా జగన్ అవలంబిస్తున్న గందరగోళ వైఖరి వల్ల వైసీపీకి భవిష్యత్తులో కూడా రాజధాని ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం అసాధ్యం. స్థిరత్వం లేని నాయకత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని గడచిన ఎన్నికలే నిరూపించాయి.
ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేని మూర్ఖత్వం
ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన విధానాలను మార్చుకోవడం సహజం. కానీ జగన్ రెడ్డి మాత్రం భిన్నం. సొంత రాష్ట్ర రాజధానిని ఒక వైభవోపేతమైన నగరంగా నిర్మించాల్సింది పోయి, దానిని ఒక వివాదాల సుడిగుండంగా మార్చిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు, అది అమరావతిపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ . మూడు రాజధానుల నినాదాన్ని ప్రజలు నూటికి నూరు శాతం తిరస్కరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వైసీపీకి దక్కిన ఫలితాలు ఆ పార్టీ వికేంద్రీకరణ వాదాన్ని ప్రజలు నమ్మలేదని నిరూపించాయి. ఇంతటి భారీ పరాజయం తర్వాత కూడా, జగన్ తన తప్పును సరిదిద్దుకోకుండా మళ్ళీ నదీగర్భం , ముంపు ప్రాంతం అంటూ పాత పాటనే అందుకోవడం ఆయ మూర్ఖత్వాన్ని, ప్రజల తీర్పు పట్ల ఉన్న అగౌరవాన్ని సూచిస్తోంది. రాజధాని అనేది ఒక పార్టీకో, ఒక వ్యక్తికో సంబంధించింది కాదు, అది రాష్ట్ర గౌరవానికి, లక్షలాది మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచ బ్యాంకు నుండి నిధులు సాధించి, పనులు వేగవంతం చేస్తుంటే.. దానిని అభినందించాల్సింది పోయి, మళ్ళీ అడ్డంకులు సృష్టించేలా మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటి? సొంత రాష్ట్ర రాజధానిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేసే నాయకుడు దేశంలోనే మరొకరు ఉండరు. అభివృద్ధిని అడ్డుకోవడమే రాజకీయంగా తన మనుగడకు మార్గమని భావించడం జగన్ చేస్తున్న చారిత్రక తప్పిదం.
కాలం ఇచ్చే హెచ్చరికలను గుర్తించాలి!
రాజకీయాల్లో ఏ నాయకుడైనా కాలం ఇచ్చే హెచ్చరికలను గమనించాలి. ప్రజలు ఒకసారి తిరస్కరించినప్పుడు, ఆ విధానాలను మార్చుకుని ప్రజల పక్షాన నిలబడాలి. కానీ, జగన్ మాత్రం తన పంతమే నెగ్గాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తన తప్పును ఒప్పుకోని, ప్రజల ఆకాంక్షలను గుర్తించని ఏ నాయకుడైనా కాలక్రమేణా రాజకీయంగా కనుమరుగైపోవడం ఖాయం. ఒకప్పుడు అప్రతిహత మెజారిటీతో గెలిచిన పార్టీ, కేవలం ఐదేళ్లలోనే ఒక అప్రధాన శక్తిగా మారిపోవడానికి ఈ మొండి వైఖరే ప్రధాన కారణం. 2019లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన పార్టీ, 2024లో కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవడం ఒక చారిత్రక అవమానం. ఈ పతనం ఇక్కడితో ఆగలేదు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోట గా ఉన్న పులివెందు జడ్పీటీసీ స్థానాన్ని కూడా టీడీపీకి కోల్పోవడం వైసీపీ పతనానికి పరాకాష్ట. సొంత గడ్డపైనే ప్రజలు తిరస్కరిస్తున్నారంటే, అది నాయకత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనం. ఇంతటి ఘోర పరాజయాల తర్వాత కూడా, జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ విధానాలను మార్చుకోకపోవడం విచారకరం. ప్రజల ఆకాంక్షలు ఏంటి? వారు ఎందుకు తమను దూరం చేసుకున్నారు? అనే ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. రాజకీయాల్లో ఓటమి సహజం, కానీ ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా మొండిగా పాత పంథాలోనే సాగడం ఆత్మహత్యాసదృశ్యం. ప్రజల నాడిని పట్టడంలో విఫలమైన నాయకుడు, క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించకుండా ఇంకా తన మాయా లోకం లోనే విహరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు.
కనుమరుగు కావడమే మిగిలింది !
తప్పు తెలుసుకోని నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడన్నది చరిత్ర చెప్పే సత్యం. అమరావతిపై విష ప్రచారం, నీటి ప్రాజెక్టులపై గందరగోళ వ్యాఖ్యలు, సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం.. ఇవన్నీ జగన్ రాజకీయ మనుగడకు ప్రమాద ఘంటికలు. విజ్ఞత గల నాయకుడైతే ప్రజల వద్దకు వెళ్లి క్షమాపణ కోరి, వారి ప్రయోజనాల కోసం తన విధానాలను ‘పీపుల్ సెంట్రిక్’గా మార్చుకోవాలి. అలా కాకుండా, ఇంకా తన పంతమే నెగ్గాలని చూస్తే.. కేడర్ సైతం తోడుండని పరిస్థితి ఏర్పడుతుంది. అమరావతిపై జగన్ చేస్తున్న తాజా కుట్రలు ఆయనకు రాజకీయంగా మరిన్ని నష్టాలను చేకూర్చడమే కాకుండా, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న మిగిలిన విశ్వసనీయతను కూడా తుడిచివేస్తాయి. తప్పు తెలుసుకుని సరిదిద్దుకోని నాయకుడు, చరిత్రలో ఒక చెరిగిపోని అధ్యాయంగా కాకుండా.. కాలగర్భంలో కలిసిపోయే ఒక హెచ్చరికగా మాత్రమే మిగిలిపోతాడు. ఇప్పటికైనా అమరావతిని రాష్ట్ర రాజధానిగా మనస్ఫూర్తిగా అంగీకరించి, విమర్శనాత్మక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకపోతే వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమే.


