ఫిరాయింపుల మొదలైన దగ్గర నుంచీ ప్రతిపక్ష పార్టీగా వైకాపా విఫలమౌతూనే ఉందన్న అభిప్రాయం కొంతమేరకు రాజకీయ వర్గాల్లో ఉంది! తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడంలోనూ, ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలోనూ జగన్ సేన నత్తనడక నడుస్తోందనే చెప్పాలి. రాజధాని భూసేకరణ వివాదం, ప్రత్యేక హోదా ఉద్యమం, నిన్నమొన్నటి ఆక్వారైతుల సమస్య… ఇలాంటి బలమైన ప్రభుత్వ వ్యతిరేకాంశాల విషయంలో వైకాపా స్పందన చురుగ్గా లేదు! ఏరకంగా చూసుకున్నా అధికార తెలుగుదేశం పార్టీపై వైకాపా పట్టు సాధించిన సందర్భాలు చాలా తక్కువే. నిజానికి, జగన్ చేతిలో సొంత మీడియా ఉన్నా కూడా బలమైన ప్రతిపక్ష పార్టీ వాదనను జనంలోకి మోసుకెళ్లలేకపోతోందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే, ఇప్పుడు వైకాపా కొత్త వ్యూహంతో సిద్ధమౌతోంది. అధికార పార్టీపై విరుచుకుపడేందుకు సామాజిక మాధ్యమాలను ఎంచుకుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఫేస్బుక్లో వైకాపా వార్ మొదలు కాబోతోంది! అంటే, అధికార పార్టీ విధానాలనూ, చంద్రబాబు వీరాభిమానులను టార్గెట్ చేసుకుంటూ ఫేస్బుక్ ద్వారా బలమైన వాయిస్ వినిపించేందుకు ఓ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ టీమ్‌ని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లీడ్ చేయబోతున్నారట. రాష్ట్రంలో జిల్లాల వారీగా దాదాపు ఓ యాభైమంది జగన్ వీరాభిమానులను గుర్తించినట్టు తెలుస్తోంది. వీరందరికీ వచ్చే నెలలో శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారట! అధికార పార్టీ విధానాలను బలంగా ప్రశ్నిస్తూ.. ఎప్పటికప్పుడు కౌంటర్లు వేయడమే ఆ బృందానికి పని. తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా ఎన్నికల సందర్భం నుంచే బలంగా ఉంది. నిజానికి, అప్పట్లో సోషల్ మీడియాను జగన్ లైట్‌గా తీసుకున్నారు. దాని ప్రాధాన్యతను కాస్త లేటుగానైనా ఇప్పుడు గుర్తించారని చెప్పాలి.
ఫేస్బుక్ ద్వారా విమర్శలూ ప్రతి విమర్శలూ చేయడం పార్టీకి మంచిదే. కానీ, ఆ ప్రభావం చాలా కొద్ది శాతం ఉంటుంది. ఎందుకంటే, గ్రామీణ ప్రాంతాల్లో.. ముఖ్యంగా రైతులు, నిరక్షరాస్యులకు ఫేస్బుక్ అందుబాటులో ఉంటుందా అనేది ప్రశ్న. అంతేకాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా చేతిలో ఉంచుకుని, కేవలం సోషల్ మీడియా మీదే ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సరైన వ్యూహమా అనేది మరో ప్రశ్న! పేపరు, టీవీ ఛానెల్, వెబ్ మీడియాలు ప్రజల్లోకి బలంగా దూసుకుపోతాయి. ముందుగా వాటికి జవసత్వాలు ఇవ్వాలి. ఆ తరువాత, సోషల్ మీడియాను కూడా వదలకూడదు. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే మీడియా సంస్థలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం బలోపేతమైంది కేవలం సోషల్ మీడియా వల్లనే కాదు కదా… వెన్నుదన్నుగా ఉండాల్సినవి కూడా ఉన్నాయి కదా! వైకాపా గుర్తించాల్సింది అదే. మరి, ఈ సోషల్ మీడియా వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.