వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం సెలవు తీసుకున్నారు. ప్రతి సారి మంగళవారం సాయంత్రం తాడేపల్లికి వస్తారు. గురువారం సాయంత్రం తిరిగి వెళ్తారు. ఇలా వీక్లీ త్రీ వర్కింగ్ డేస్ ప్లాన్ చేసుకునేవారు. కానీ ఈ వారం అది కూడా లేదు. అసలు బెంగళూరు నుంచి తాడేపల్లికి రాలేదు.
ఓడిపోయిన దగ్గర నుంచి తన చెల్లి షర్మిలకు ఎంవోయూలో రాసిచ్చిన బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లోనే ఉంటున్నారు జగన్. ఆ ప్యాలెస్ ను షర్మిల స్వాధీనం చేసుకుంటారని భయపడుతున్నారో .. లేకపోతే హైదరాబాద్ కంటే బెంగళూరే బెటరని అనుకున్నారో కానీ లోటస్ పాండే వైపు కూడా చూడకుండా.. బెంగళూరులోనే ఉంటున్నారు. వారంలో ఓ సారి తాడేపల్లికి వచ్చి.. అయితే ప్రెస్ మీట్ లేకపోతే ఎంపిక చేసిన కొంత మంది కార్యకర్తల్ని పిలిచి మాట్లాడటం చేస్తున్నారు. ఇటీవల పరామర్శల పేరుతో రచ్చ చేయడం కూడా ప్రారంభించారు.
కానీ ఈ వారంలో అంతా సైలెంట్ అయిపోయారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం.. చార్జిషీటులో జగన్ పేరు ప్రస్తావించడంతో ఆయన తాడేపల్లికి రాలేదు. బెంగళూరులోనే ఉండి.. పూర్తి సమయం ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మేథోమథనం చేస్తున్నారు. ఢిల్లీ కి లాబియింగ్ చేస్తున్నారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. తెర వెనుక ప్రయత్నాలు సక్సెస్ అయితే.. అప్పుడు తాడేపల్లికి వచ్చి లిక్కర్ స్కాంపై సమగ్రంగా ప్రెస్ మీట్ పెట్టి ఎదురుదాడి చేస్తారని చెబుతున్నారు.
ఇంకా ముందు ముందు చాలా కేసులు వరుసపెట్టే అవకాశం ఉండటంతో.. పూర్తి స్తాయిలో తన లీగల్ టీముల్ని యాక్టివేట్ చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ఈ టీములకు నాయకత్వం వహిస్తారు.