రాజకీయాల్లో ఒకప్పుడు విశ్వసనీయత అనే పదాన్ని పదేపదే వల్లించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అందరికీ తెలిసిన నిజాలను కూడా పచ్చి అబద్దాలుగా చెబుతూ ఎవరూ నమ్మకూడని నేత అనే స్థితికి వచ్చారు. తన మాటల గారడీతో ప్రజలకు వినోదాన్ని పంచే స్థాయికి పడిపోయారు. ఆయన రాజకీయాలను జోక్ గా మార్చేశారు. ఆయన చేసే విచిత్రమైన ప్రకటనలు, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయ నేత కంటే కూడా ఒక స్టాండప్ కమెడియన్ పాత్రకు ఆయన ఎక్కువగా సరిపోతారన్న కామెంట్లు వస్తున్నాయి. నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ప్రదర్శించిన తీరు ఇందుకు పరాకాష్టగా నిలిచింది.
హవ్వ.. మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ కొట్టేస్తారా?
కొద్ది నెలల క్రితం ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ ఒడిశాకు వెళ్లిపోతోంది.. చంద్రబాబు ఏపీకి వస్తుందంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారు అని ఎగతాళి చేసిన జగన్, ఇప్పుడు అదే ప్లాంట్‌కు శంకుస్థాపన జరగగానే అది నేనే తెచ్చాను అని క్రెడిట్ తీసుకోవడం చూసి జనం విస్తుపోతున్నారు. ఆయన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తన పాత మాటలను జనం మర్చిపోయి ఉంటారని ఆయన అనుకోవడం ఆశ్చర్యకరం. సోషల్ మీడియా యుగంలో ఆయన పాత వీడియోలు, ప్రస్తుత వ్యాఖ్యలు కలిపి వస్తున్న ట్రోల్స్ జగన్ రాజకీయ పరిణతిని ప్రశ్నిస్తున్నాయి.
జగన్‌ను ఏ విషయంలో ప్రజలు నమ్మాలి?
ఇది ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలోనే కాదు, గతంలోనూ అనేక అంశాల్లో జగన్ తీరు నవ్వులపాలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానని చెప్పి ఏమీ చేయలేకపోవడం, అమరావతి విషయంలో మూడు రాజధానులంటూ చేసిన ప్రయోగాలు విఫలం కావడం ఆయన క్రెడిబిలిటీని సున్నాకు పడేశాయి. ఆయన మాటలకు సొంత పార్టీ నాయకుల్లోనే నమ్మకం సన్నగిల్లింది. బయటకు చెప్పలేక వారు కూడా జగన్ వైఖరిని లోలోపల కామెడీగా తీసుకుంటున్నారు ఒకప్పుడు సీరియస్ పాలిటిక్స్ చేసిన నేత, ఇప్పుడు కేవలం ట్రోల్ మెటీరియల్ గా మారిపోయారు.
ముడేసుకోవడానికి జుట్టు లేకుండా పోతోంది !
గతంలో బటన్ నొక్కడం గురించి ఆయన ఇచ్చిన బిల్డప్ నుంచి, ప్రతిపక్షంలో ఉండగా చేసిన వాగ్దానాల వరకు అన్నీ ఇప్పుడు పేరడీలుగా మారుతున్నాయి. వాస్తవానికి దూరంగా, కేవలం ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా సాగే ఆయన ప్రసంగాలు వింటుంటే.. అది రాజకీయ వేదికలా లేక కామెడీ షోలా అనే సందేహం సామాన్యులకు కలుగుతోంది. రాజకీయాల్లో విశ్వసనీయత పోగొట్టుకున్న నాయకుడు మనుగడ సాగించడం కష్టం. ప్రతి విషయంలోనూ క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం, అది కుదరనప్పుడు వితండవాదం చేయడం వల్ల జగన్ రెడ్డి తనను తాను ఒక హాస్యాస్పద పాత్రగా మార్చుకున్నారు. ప్రజలు ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవడం మానేసి, కేవలం వినోదం కోసమే వింటున్నారు. ఆయన భాషలో చెప్పుకోవాలంటే.. ముడిసుకోవడానికి జుట్టు లేదు.. అంతా ఊడిపోయింది.
