వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవహారాల కమిటీతో సమావేశం అయ్యారు. ఏ సమావేశం అయినా…వైసీపీలో వన్ వే ట్రాఫిక్ ఉంటుంది. ముందుగా అందరూ వస్తారు. సీట్లలో కూర్చుంటారు. రావాల్సిన వాళ్లు వచ్చారనుకున్న తర్వాత జగన్ రెడ్డి వస్తారు. రాసుకొచ్చింది చదువుతారు. వెళ్లిపోతారు. మిగతాది మీడియాలో వస్తుంది. మీడియాతోనే కాదు.. పార్టీ వ్యవహారాల గురించి పార్టీ నేతలతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన రాసుకొచ్చినవే చదువుతారు. పార్టీ ప్రవేశపెట్టబోయే యాప్ గురించి..దాని విధానాల గురించి చూసే చెబుతారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. తీసుకున్న నిర్ణయాలన్నీ తన బాధల కోసమే కానీ.. పార్టీ కోసం కాదు. ప్రజా సమస్యల కోసం కాదు.
జైలుకెళ్తున్న వాళ్లంతా జగన్ బాధితులే !
యాప్ తీసుకొస్తున్నాం.. అందులో ఫిర్యాదులు చేయండి.. డిజిటల్ లైబ్రరీలో దాచి పెడతాం. అధికారంలోకి వచ్చాక తీద్దాం.. ఒక్కొక్కరి సంగతి చూద్దామని జగన్ చెప్పుకొచ్చారు. ఆయన ఉద్దేశం .. పోలీసుల కేసులతో జైలుకెళ్తున్న వారే. వారు అలా ఎందుకు వెళ్తున్నారు?. మిథున్ రెడ్డి దగ్గర నుంచి మాచర్ల రౌడీ షీటర్ వరకూ అందరూ జైలుకెందుకు వెళ్లారు. వందల మంది ఎందుకు కేసుల పాలవుతున్నారు ?. అవినీతి చేయని వాళ్లకు ఎవరు చెప్పారు ?. నేరాలకు పాల్పడమని వాళ్లకు ఎవరు చెప్పారు ?. టీడీపీ ఆఫీసులపై.. నేతలపై దాడులు చేయమని వారికెవరు చెప్పారు?. జగన్ రెడ్డి కి లంచాల కోసం.. జగన్ రెడ్డికి మానసిక ఆనందం కోసం తప్పుడు పనులు చేసి ఇప్పుడు బలవుతున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతుంది?
ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీ ఎగ్గొట్టే వైపరీత్యం
ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్లని ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా?. ఇవ్వాలని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని అర్థం రాలేదనే కదా. పది శాతం స్థానాలు రాకపోయినా ప్రతిపక్షమే. కానీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఉండదు. కానీ ప్రజలు ఇవ్వని ఆ స్థానాన్ని తనకు ఇవ్వాలని జగన్ రెడ్డి బెదిరిస్తున్నారు. ఆయన నిర్వాకాలతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నారు. సాక్షి టీవీలో కూర్చుకుని వీరమల్లు లాంటి సినిమాపై వ్యతిరేక ప్రచారం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నారు. ఇప్పటికీ జగన్ ఎమ్మెల్యేలను.. పార్టీ నేతలను.. తన ఈగో శాటిస్ ఫేక్షన్ కోసం వాడుకుంటున్నారు కానీ.. ప్రజా సమస్యల కోసం కాదు.
జగన్ సెక్యూరటీనే సమస్య
జగన్ రెడ్డికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. సీఎంగా ఉన్నప్పుడు వందల మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా భద్రత కావాలని డ్రామాలేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయన శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. సింగయ్య లాంటి వారి ప్రాణాలు తీస్తున్నారు. రైతుల పంటలను లాక్కుని రోడ్డు మీద పారబోస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలు చేస్తూ.. తనకు సెక్యూరిటీ లేదని అంటున్నారు. ఇంకా పెంచాలని అంటున్నారు.
జగన్ రెడ్డి ఇప్పటికీ పథకాలు.. పథకాలు అంటారు కానీ.. ప్రజాసమస్యలు ఏమిటి.. వాటి కోసం ఎలా పోరాడాలన్నది చూడటం లేదు. అసలు ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయరు. తన బాధల్నే ప్రజలు తమ బాధలుగా చూడాలని అనుకుంటూ ఉన్నారు. ఈ మైండ్ సెట్ ఉన్నవారు ఎవరూ బాగుపడే సూచనలు ఉండవు.