ఇది కవిత కాదంటే రాయిచ్చుకు కొడతా అని.. కవిత రాస్తారు ఓ సినిమాలో శ్రీలక్ష్మి. ఎదుటి వారు అది కవితేనని అంగీకరించక తప్పదు. జగన్ రెడ్డి కూడా ఇప్పుడు అలాంటి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. క్రెడిట్ చోరీలు చేస్తూ.. అంతా నేనే చేశానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆ మాటల్ని వినేవారు ఎవరంటే.. ఆయన వందిమాగధులే. వారెవరూ నోరు మెదపరు. భోగాపురం ఎయిర్ పోర్టు నేనే తెచ్చా అంటే.. అదేంటి నువ్వే కదా.. టీడీపీ ప్రభుత్వంలో భూసేకరణ చేస్తూంటే భూములు ఇవ్వొద్దు.. విశాఖ ఎయిర్ పోర్టే ఈగలు తోలుకుంటోందని ఉద్యమం చేశావు అని ఎవరైనా అంటే వారిని రాయిచ్చుకు కొడతారు. అలా కొట్టించుకోకుండా అందరూ సైలెంటుగా ఉంటారు.
ఐదు సంవత్సరాల్లో జగన్ రెడ్డి ఏం చేశారో అందరూ చూశారు. దండం పెట్టి చెబుతున్నాం వెళ్లిపోండి అని పెట్టుబడిదారుల్ని బెదిరించిన వైనం చూశారు. ఏపీకి ఒక్క పరిశ్రమ రాకపోవడం చూశారు. వచ్చిన పరిశ్రమల్ని వెళ్లగొట్టడం చూశారు. తనకు ఉన్న మీడియాను, సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేసుకుని.. ఎన్ని ప్రచారాలు చేసుకున్నా నిజాన్ని జనం గుర్తించారు. ఎందుకంటే కళ్ల ముందు ఏం లేదు. ఆయన చేసిందేమిటంటే.. వైజాగ్ ప్యాలెస్ కట్టుకోవడం.
అయినా సరే.. సింగపూర్ నుంచి వచ్చే కేబుల్స్ దగ్గర నుంచి రేపు అమరావతి పూర్తయితే.. ఆ రాజధాని వరకూ క్రెడిట్ మొత్తం ఆయనే చోరీ చేస్తారు. అమరావతిని నేను తరలించేస్తానని భయం ఉండబట్టే పూర్తి చేశారని రేపోమాపో.. చెప్పుకుంటారు. ఆ చావు తెలివితేటలు ఆయన సొంతం. ఆయన సలహాదారుల సొంతం. ప్రజలు ఎన్నో ఆశలతో చాన్స్ ఇస్తే మొత్తానికే నాశనం చేసిన ఆయన.. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చే పెట్టుబడులకు.. చేసే పనులకు.. మొత్తం నేనే .. నేనే అని సిగ్గుపడకుండా క్లెయిమ్ చేసుకుంటున్నారు.
జగన్ రెడ్డి చెప్పినట్లుగా ప్రచారం చేస్తారు వైసీపీ మీడియా..సోషల్ మీడియా. పెట్టుబడుల కోసం చంద్రబాబు పడే కష్టం.. కళ్ల ముందే ఉంటుంది. పారిశ్రామికవేత్తల వెంటపడి మరీ తీసుకు వస్తే.. నేనే బీజం వేశా.. నేనే రోడ్డు వేశా.. అందులో నుంచే వస్తున్నాయంటే ప్రచారం చేసేస్తారు. చేయకపోతే బూతులు, రాళ్లతో కొడతారన్న భయం. అందుకే జగన్ రెడ్డి ఇక క్రెడిట్ చోరీని కూడా తన వ్యూహంలో భాగంగా మార్చుకుంటారు. కాదన్నవాళ్లను రాయిచ్చుకుకొడతారు.
