ఓ వైపు అసెంబ్లీ జరుగుతూంటే తాడేపల్లి ఆస్థానంలో జగన్ రెడ్డి.. మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల ప్రజాధనంతో తన ప్రైవేటు ఇంట్లో..ఇలాంటి మీటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సౌకర్యాలను ఓడిపోయిన తర్వాత..తిరిగి ఇవ్వలేదు. పదుల కోట్ల ప్రజాధనం పెట్టి తన ఇంటికి జగన్ రెడ్డి సౌకర్యాలు కల్పించుకున్నారు. పదవి పోయాక బాధ్యతగా అయినా వాటిని తిరిగి ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా సిగ్గు పడకుండా వాడేసుకుంటున్నారు.
ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా.. అదే ఆస్థానంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల్ని పిలిపించుకుని ముచ్చట్లు చెప్పారు. ఏం మాట్లాడారో కానీ.. ఆయన మీడియా మాత్రం ప్రజల కోసం మేథోమథనం చేశారని చెప్పుకుంటారు. తనకు హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి ఎగ్గొట్టే వ్యక్తి.. ప్రజల కోసం ఆలోచిస్తారని ఎవరూ అనుకోలేరు. గతంలో అసెంబ్లీకి రాకుండా ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని కడిగి పారేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ప్రెస్మీట్లు కూడా పెట్టడం లేదు. పార్టీ నేతలతో మాక్ అసెంబ్లీ పెట్టినట్లుగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.
జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయం పిల్లలాటలా ఉన్నప్పటికీ ఆయన పార్టీ నేతలకు తప్పడం లేదు. పిలిస్తే వెళ్లి తాడేపల్లిలో హాజరు వేయించుకుని జగన్ ముందు కూర్చుని .. ఇస్తే టీ , కాఫీలు తాగి రావడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. పోరాటం అంటే.. సోషల్మీడియాలో ఫేక్ చేయడం మాత్రమే అనుకుంటున్నారు. కనీసం అసెంబ్లీకి వెళ్తే ప్రజలు అయినా కాస్త సానుభూతి చూపించేవాళ్లేమో కానీ.. ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూంటే వారు మాత్రం ఏం జాలి చూపిస్తారు.