జగన్ రెడ్డి 2014-19 మధ్య ఊరూరా తిరుగుతూ ఓ మాట చెప్పేవారు. తనకు ఓ అవకాశం ఇవ్వండి నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకునేలా 30 ఏళ్ల పాటు పరిపాలిస్తానని. ఈ మాటే అందరూ ఏమనుకుంటారు?. అద్భుతంగా పరిపాలిస్తారు.. ప్రజలు జీవితాలని మారుస్తారు.. వారు అభిమానంతో జగన్ రెడ్డి ఫోటోను ఇంట్లో పెట్టుకుంటారు అని అనుకుంటారు. అందరూ అలా అనుకుంటారు కానీ జగన్ రెడ్డి మాత్రం అలా అనుకోరు. తాను తన ఫోటోను ఇంట్లో పెట్టుకుంటారు అని చెప్పాను కానీ ప్రేమతోనో .. అభిమానంతోనే పెట్టుకుంటారని చెప్పలేదని.. కానీ ఫోటోను మాత్రం ఇంట్లో పెట్టే పాలన చేశారు. ఫలితంగా పాంప్లెట్ల నుంచి పాస్ బుక్కుల వరకూ అన్నీ జగన్ ఫోటోతోనే ఇంట్లోకి చేరాయి.
పాలనలో ఉన్నంత కాలం ఫోటోల పిచ్చి
జగన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజాధనంతో ఆయన సొంతానికి పబ్లిసిటీ చేసుకున్నారు. ప్రభుత్వం నడిపేది సీఎం కాబట్టి కొన్ని అంశాల్లో సీఎం ఫోటో వాడటం సంప్రదాయంకానీ.. ఏపీలో బతుకుతున్నారు కాబట్టి ఏపీ ప్రజలందరికీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అందరి నుదుటి ముందు జగన్ ఫోటో వేసుకుని తిరగాలన్నట్లుగా ఆయన పాలన చేశారు. ఆస్పత్రికి వెళ్తే ఓపీకి ఇచ్చే చీటీ మీద జగన్ రెడ్డి ఫోటో. రేషన్ కార్డు మీద జగన్ రెడ్డి ఫోటో. ఇలా చెప్పుకుంటూ పోతే .. ప్రభుత్వం అని చెప్పుకునేప్రతి వ్యవస్థలో జరిగే వ్యవహారాలపై జగన్ రెడ్డి ఫోటో ఉండేది. ఇలా అందరి ఇళ్లలోకి చేరేది. చివరికి పాస్ బుక్కుల మీదకు కూడా చేరాడు.
అన్నిరూల్స్ అతిక్రమణ – ప్రజాధనం నష్టం
పాస్ బుక్కులు అంటే ఆస్తి హక్కు. దానిపై రాజముద్ర మాత్రమే ఉండాలి. అదేమీ జగన్ రెడ్డిఆస్తి కాదు. ప్రభుత్వం అంటే… ప్రభుత్వం లాగా వ్యవహరించాలి.కానీ పాస్ బుక్కులపై జగన్ రెడ్డిముద్ర వేసి.. వైసీపీ రంగులో పాస్ బుక్కులు తయారు చేసి పంచారు. అవి ఎందుకూ పనికిరావు. అలా అయితే తాను ప్రతి ఇంట్లో ఉంటానని జగన్ రెడ్డి అనుకున్నారు. ఆయన తెలివి తేటలు అలా ఉన్నాయి. అలాగే పొలాల్లోనూ తానే ఉండాలని.. రాళ్ల మీద ఆయన ఫోటో ముద్రించుకున్నారు. ఇలాంటి అతి తెలివి తేటలతో ఆయనచేసిన పనుల కారణంగా పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు, ముద్రలు ఏమీ లేకుండా పోతున్నాయి.
మారకపోతే రాజకీయాల నుంచి మార్చేస్తారు !
ప్రభుత్వం జగన్ ఫోటో ఉన్న రాళ్లను తొలగిస్తోంది. పాస్ పుస్తకాలను మార్చేసింది. జగన్ రెడ్డి తాను కోట్లు ఖర్చు పెట్టుకుని రెడీ చేసి పెట్టిన ఇతర ముద్రలు ఉన్న మెటిరియల్ ను ఉన్నంత వరకూ వాడి తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా .. కేవలం ప్రభుత్వ ముద్రతో ఉండేలా తయారు చేసి ప్రజలుు పంపిణీ చేస్తోంది. జగన్ రెడ్డి ఇలాంటివి చూసి అయినా ప్రజల్ని మోసం చేయకూడదని.. నిజాయితీగా రాజకీయాలు చేయాలని అనుకుంటే.. కాస్త మార్పు వస్తుంది. ప్రజల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటే.. రేపు ఆయనను కూడా రాజకీయాల్లోకి లేకుండా చేసే శక్తి ప్రజలకు ఉంది.
