గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి గంట సేపు సమావేశం అయ్యారు. అంత సేపు సమావేశం అయ్యారంటే ఖచ్చితంగా కీలక అంశాలపై చర్చించి ఉంటారు. ప్రస్తుతం జగన్ రెడ్డి సీఎం కాదు కాబట్టి అధికార విషయాలపై చర్చ జరిగే చాన్స్ లేదు. ప్రతిపక్ష నేత కూడా కాదు. పైగా ప్రజా సమస్యల కోసం చర్చించడానికి వెళ్లానని జగన్ కూడా చెప్పుకోవడం లేదు. మర్యాదపూర్వకంగా కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ కు గంట పాటు జగన్ చేసిన మర్యాదపూర్వక చర్చలేమిటో మాత్రం బయటకు రాలేదు. కానీ జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే.. ఆయన తనను కాపాడాలని గవర్నర్ ను వేడుకున్నారని.. తన భార్య భారతిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని వాపోయినట్లుగా చెబుతున్నారు.
పది రోజుల పాటు బెంగళూరులో ఉండి తెర వెనుక ప్రయత్నాలు
జగన్ రెడ్డి గత వారం బెంగళూరు నుంచి తాడేపల్లికి రాలేదు. మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ఆయన సోమవారమే తాడేపల్లికి వచ్చారు. అది కూడా గవర్నర్ తో అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో వచ్చారు. ఈ పది రోజుల్లో బెంగళూరు నుంచి తనను లిక్కర్ స్కాం గండం నుంచి బయటపడే మార్గాలపై చాలా మందితో చర్చలు జరిపారని అంటున్నారు. ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు కానీ ఎవరూ సమావేశం అయ్యేందుకు ఆసక్తి చూపే అవకాశాలు లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. చివరికి గవర్నర్ తో భేటీ అయితే ఆయన ద్వారా… ప్రయత్నిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని అనుకుని .. రాజ్ భవన్ కు వచ్చినట్లుగా చెబుతున్నారు.
భారతి సిమెంట్స్ కార్యాలయాల్లో సోదాలతో అసలు టెన్షన్
లిక్కర్ సొమ్ము చాలా వరకూ భారతి సిమెంట్స్ లోకి ప్రవహించిందని సిట్ అధికారులు గుర్తించారు. ఆధారాలు సేకరించారు. భారతి సిమెంట్స్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. బాలాజీ గోవిందప్ప .. భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే ఆడిటర్. ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు సోదాలు కూడా చేశారు. ఆర్థిక లావాదేవీలన్నీ తుడిచేస్తే కనిపించకుండా పోయే లావాదేవీలు కాదు. అడ్డంగా దొరికిపోయారన్న ప్రచారం జరుగుతోంది. భారతి కూడా లిక్కర్ స్కాంలో కీలక నిందితురాలని.. కాంగ్రెస్ ఎంపీ మాణిగం ఠాగూర్ ఉత్తినే ప్రకటించి ఉండరని అనుకోవచ్చు. కేసు భారతి దగ్గరకు వస్తుందన్న భయంతోనే జగన్ ఇలాంటి భేటీలతో బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
లిక్కర్ స్కాం నుంచి కాపాడే ఫార్ములా ఉండకపోవచ్చు !
జగన్ అండ్ కో ను లిక్కర్ స్కాం నుంచి కాపాడే ఫార్ములా ఏమీ ఉండదని టీడీపీ వర్గాలు ధీమాతో ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాలను సైతం దోచుకున్న ఈ స్కాంలో నిందితుల్ని వదిలి పెట్టేది లేదని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో జగన్ ..ఎంతగా లొంగిపోయినా.. ఇక్కడ అవేమీ చెల్లవని నమ్మకంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో లిక్కర్ స్కాంలో.. దోచుకున్న సొమ్ము చాలా బయటపడబోతోంది. ఈ క్రమంలో అసలు దొంగలు బయటకు వస్తారు. అప్పుడే అసలు కథ ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలంటున్నాయి. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసిన వృధానే అంటున్నారు.