జగన్ కు అధికారం కోల్పోయాక కడప రైతాంగం గుర్తుకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు సొంత జిల్లా రైతులను పట్టించుకోని జగన్.. కూటమి కొట్టిన దెబ్బకు తప్పనిసరిగా రైతులను తలుస్తున్నారు. రాజకీయం చేసేందుకు నామమాత్రమైన అవకాశమే ఉన్నా.. ఎక్కడో చోట స్పేస్ క్రియేట్ చేసుకొని వెళ్లేందుకు రెడీ అయిపోయారు.ఇటీవల అకాల వర్షాలతో కడప జిల్లా అరటి రైతులు నష్టపోయారని వారిని ఆదుకుంటామని,జగన్ వారికి అండగా నిలుస్తారని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లింగాల మండలంలో ఉద్యాన పంటలు, ముఖ్యంగా అరటి తోటలు కొంతమేర దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. అధికారుల నివేదిక వచ్చాక నష్టపరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సర్కార్ సాయం కొంత ఆలస్యం అవుతుందని, ఈలోపు రైతుల వద్దకు వెళ్లాలని వైసీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం చేస్తామని వైసీపీ చెప్పింది. డీడీల రూపంలో రైతులకు అందిస్తారని చెప్పారు. అయితే, జగన్ కు అనూహ్యంగా కడప జిల్లా రైతాంగంపై ప్రేమ ఎందుకు పొంగుకొచ్చిందని చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో జగన్ సొంత జిల్లా కడపలోనూ వైసీపీకి మూడు సీట్లే వచ్చాయి. దీంతో అక్కడ కూటమి వచ్చే ఎన్నికల నాటికి మరింత పాగా వేస్తుందనే భయం వైసీపీలో కనిపిస్తోంది.
జగన్ కూడా గతానికి భిన్నంగా తక్కువ మెజార్టీతో నెగ్గారు. అవినాష్ రెడ్డికి షర్మిల పోటు ఎక్కువైంది. క్యాడర్ కూడా జగన్ పై అసంతృప్తిగా రగిలిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదు.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని గుర్రుగా ఉన్నారు. దీంతో సొంత జిల్లాలో పార్టీ పటిష్టతకు ఏదో ఒక మార్గం ద్వారా చర్యలు చేపట్టాలని వైసీపీ భావిస్తోంది. ఈమేరకు రైతులకు ఆర్థిక సాయాన్ని చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
నిజంగానే రైతులకు చిత్తశుద్ది ఉంటే రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం చేయకుండా,కడప రైతుల వరకు మాత్రమే జగన్ పరిమితం అయ్యారంటే..జిల్లాలో మద్దతు కోసమే ఈ డ్రామా అంటూ విమర్శలు వస్తున్నాయి.