మాట కంటే ముందు క్రెడిట్.. మాట తర్వాత క్రెడిట్. జగన్ రెడ్డి క్రెడిట్ కోసం అల్లాడిపోతున్నాడు. తన క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతోందని అనుకుంటున్నారు. అదేపనిగా క్రెడిట్చోరీఅని ప్రచారం చేసేస్తున్నారు. నిజానికి ఆయన పని పావలా పని చేసి.. వంద రూపాయల ప్రచారం చేసుకుంటారు. ప్రచారం కోసం వందలకోట్లు తన సొంత సంస్థకు..బాకా మీడియాకు.. వలాంటీర్లకు ధారబోశారు. అయినా పనులు చేయకుండా.. ప్రాచరంచేసుకుంటే ప్రజలు నమ్మరని ఆయన గుర్తించలేదు. ఇప్పుడు ప్రభుత్వం అన్నీ పనులు చేస్తూంటే.. ఇదిగో నేనే .., నేనే మళ్లీ అదే ప్రచారం వ్యూహంతో వస్తున్నారు.
పనులేమీ చేయకపోయినా ప్రచారం చేసుకున్నారుగా !
ఐదేళ్లలో ఆయన చేసిన పని పిసరంత అయితే చేసుకున్న ప్రచారం కొండంత. చేసిన చిన్న పనికి కూడా తన బొమ్మ వేసుకోవడం, తన పేరే చెప్పుకోవడం కోసం అల్లాడిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తుంటే, ఇది నా వల్లే జరిగింది.. అది నా క్రెడిటే అంటూ క్రెడిట్ చోరీ జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రచారం కోసం వందల కోట్లు ధారబోశారు. తన సొంత మీడియా సంస్థలకు, తన బాకా ఊదే పత్రికలకు, ఛానళ్లకు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా పంచారు. చివరికి వాలంటీర్ల వ్యవస్థను కూడా తన వ్యక్తిగత ప్రచార యంత్రంగా మార్చుకున్నారు.
ఏం చేశారో ప్రజలకు తెలియదా?
పనులు జరగకపోయినా, ప్రాజెక్టులు పూర్తి కాకపోయినా కేవలం బటన్ నొక్కడం ద్వారా అంతా అయిపోయిందని ప్రజలను నమ్మించవచ్చని ఆయన భావించారు. కానీ, భూమి మీద పని జరగకుండా కేవలం తెరపై ప్రచారం చేసుకుంటే ప్రజలు నమ్మరనే నగ్న సత్యాన్ని ఆయన గుర్తించలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తుంటే, పెండింగ్ పనులను పూర్తి చేస్తుంటే.. జగన్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. గతంలో ఏ రోజూ పట్టించుకోని పనులపై కూడా ఇప్పుడు తన ముద్ర ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు. అవకాశం ఇచ్చినప్పుడు పనులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు.
అధికారం చేతిలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించి, ప్రజలకు మేలు చేయకుండా ఇప్పుడు క్రెడిట్ కోసం అల్లాడిపోవడం చూస్తుంటే ఆయన రాజకీయం ఎంత అథమస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు చాలా విజ్ఞులని జగన్ రెడ్డి ఇప్పటికీ గ్రహించడం లేదు. ఏ పని ఎవరు చేశారు? ఏ ప్రాజెక్టు ఎవరి వల్ల పూర్తయింది? అనేది ప్రజల కళ్ల ముందే కనిపిస్తోంది. పని చేసే వాడికి క్రెడిట్ దానంతట అదే వస్తుంది, అడగాల్సిన పని లేదు. కానీ పనులు చేయకుండా కేవలం ప్రచారం కోసం వెంపర్లాడటం వల్లే జగన్ ఇప్పుడు ఈ స్థితికి చేరుకున్నారు.
ఇలా అల్లాడిపోవడం ఎందుకు.. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే సరిపోయేదిగా?
