వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి రెడ్డికి కాలంతో పాటు ఆరోగ్యం కలసి రావడం లేదు. క్రిస్మస్ పండుగ రోజుల్లో పవిత్ర హృదయంతో దేవుడ్ని ప్రార్థించేందుకు ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు. పులివెందుల పర్యటనకు మూడురోజుల ముందుగానే వచ్చిన ఆయన మంగళవారం ప్రజాదర్భార్ నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంలో తమకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పుకుని బాధపడ్డ వైసీపీ కార్యకర్తలకు ఆయన.. మన ప్రభుత్వం వస్తుందని భరోసా ఇచ్చి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలతోవచ్చిన వారు.. మరో మూడేళ్లు కన్ను మూసుకుంటే మన ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు సాయానికి లోటు ఉండదని ధైర్యం చెప్పారు.
బుధవారం ప్రీ క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయనకు హఠాత్తుగా జ్వరం రావడంతో అన్ని కార్యక్రమాలకూ దూరంగా ఉన్నారు. ఎవర్నీ కలవలేదు. సాధారణంగా ప్రతి ఏడాది క్రిస్మస్ మూడు రోజుల పాటు వైఎస్ కుటుంబానికి చెందిన చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. జగన్ వాటిలో పాల్గొంటారు. ఈ సారి జగన్ తప్ప కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు. ఎంతో భక్తితో ప్రతి పండుగకూ తాను సేవించే చోట దేవడ్ని సేవించుకోవడానికి బెంగళూరు నుంచి వచ్చిన జగన్ కు..జ్వరం వల్ల ఆ పని చేయలేకపోయారు.
షెడ్యూల్ ప్రకారం జగన్ ..క్రిస్మస్ రోజు అంటే గురువారం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని బెంగళూరు వెళ్లిపోవాలి. అందుకే జ్వరంగా ఉన్నా పండుగ రోజు దేవుడి సేవలో పాల్గొంటారని.. ఆ తర్వాత వెంటనే బెంగళూరు వెళ్లి ఇంట్లోనే వైద్యం చేయించుకుని విశ్రాంతి తీసుకుంటారని చెబుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ పులివెందులకు వస్తే వైసీపీ నేతలంతా అక్కడే ఉండేవారు. ఈ సారి అవినాష్ రెడ్డితో పాటు కొంత మంది కడప జిల్లాకు చెందిన నేతలు తప్ప ఎవరూ పెద్దగా కనిపించడం లేదు.
