వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా విషాదం జరిగితే, బాధితుల కన్నీళ్లను తుడువడం కంటే, ఆ కన్నీళ్ల సాక్షిగా తన రాజకీయ బలాన్ని ప్రదర్శించుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాదం జగన్ రెడ్డికి మరో మంచి అవకాశం లా కనిపిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వేట్లపాలెం వరకు వందల వాహనాలతో ఊరేగింపుగా వెళ్లి, జన సమీకరణ చేసి, తనకింకా ఏదో క్రేజ్ ఉందని నిరూపించుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఆ ప్లాన్ తాడేపల్లిలో ఇప్పటికే రెడీ అయింది. అందుకే ఈ సారి బెంగళూరు నుంచి ఎప్పటిలా బుధవారం కాకుండా.. సోమవారమే వస్తున్నారు.
ఐదు నిమిషాల ఓదార్పు.. ఐదు గంటల హంగామా!
జగన్ పరామర్శల తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులతో గడిపేది కేవలం ఐదు నిమిషాలే అయినప్పటికీ, దాని కోసం చేసే హంగామా మాత్రం గంటల తరబడి సాగుతుంది. బాధితులను కలవడానికి వెళ్లే క్రమంలో రోడ్లను దిగ్బంధించడం, వేలమంది కార్యకర్తలను సమీకరించి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం ఆయనకు అలవాటుగా మారింది. నిజంగా బాధితుల పట్ల ప్రేమ ఉంటే నిశ్శబ్దంగా వెళ్లి సాయం చేయవచ్చు, కానీ జగన్ రెడ్డికి కావాల్సింది కెమెరా ఫోకస్, సోషల్ మీడియాలో భారీ ఎలివేషన్లు మాత్రమే.
విషాదంలోనూ విజయోత్సవ తరహా యాత్రలు
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉండాల్సింది సంతాపం, కానీ జగన్ పర్యటనలు చూస్తుంటే అవి విజయోత్సవ ర్యాలీలను తలపిస్తున్నాయి. పూల వర్షాలు, నినాదాలు, రప్పారప్పా ఫ్లెక్సీల మధ్య సాగే ఈ యాత్రలు బాధిత కుటుంబాలను అవమానించడమే. బాధిత కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో ఉంటే, వారిని పరామర్శించే సాకుతో రాజకీయం చేయడం జగన్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట . అధికారం కోల్పోయిన తర్వాత తన ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి విషాద ఘటనలను వాడుకోవడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
వేట్ల పాలెం వద్ద కనిపించని ఒక్క వైసీపీ నేత
వేట్ల పాలెం వద్ద అంత పెద్ద ప్రమాదం జరిగితే ఒక్క వైసీపీ నేత కూడా రాలేదు. కానీ రేపు రాజకీయం చేయాడానికి మాత్రం వస్తారు. జగన్ రెడ్డి పర్యటనల వల్ల అటు పోలీసులు, ఇటు స్థానిక యంత్రాంగం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బాధితులకు అందాల్సిన సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిన అధికారులు, ఈయన షో కోసం సెక్యూరిటీ కల్పించడానికే సరిపోతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా రెండు రోజుల పాటు అక్కడే ఉండి, పరామర్శల పేరుతో రాజకీయ విమర్శలు చేస్తూ కాలక్షేపం చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా, మరణాల చుట్టూ రాజకీయం అల్లడంలో జగన్ రెడ్డి దిట్ట అన్న ముద్ర పడిపోయింది.
వేట్ల పాలెం మృతులకు ఆయన పరామర్శ ఇవ్వచ్చు. అయితే ఆ బాధితుల్ని అడ్డం పెట్టుకుని బలప్రదర్శన చేయకుండా.. ఆర్థిక సాయం , భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంతే వారి కష్టాలను తన రాజకీయ మైలేజీ కోసం ఎలా వాడుకోవాలని అనుకుంటే అంత కంటే సైకోతనం ఉండదు. కానీ జగన్ కు ఉన్నదే అది.
