రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలు కేవలం ప్రజాకర్షణతోనే కాకుండా, తోటి నేతలతో వ్యవహరించే తీరు, సీనియర్ల పట్ల చూపే గౌరవంపై కూడా ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , నారా లోకేష్‌ల శైలిని గమనిస్తే, సీనియర్ల పట్ల వారి దృక్పథం ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వచ్చిన సానుభూతి పవనాల ద్వారా రాజకీయాల్లోకి వేగంగా దూసుకొచ్చారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో నేర్చుకోవాల్సిన వినయం జగన్ లో లోపించింది. క్షేత్రస్థాయి నుంచి కాకుండా నేరుగా అధినేత స్థాయికి చేరుకోవడంతో, తనకంటే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వారిని కూడా ఆయన సమాన గౌరవంతో చూడలేకపోయారు.
వైసీపీలో ఎంత సీనియర్లకయినా అవమానాలే!
వైసీపీలో సీనియర్ నేతలు సైతం జగన్ ముందు భయం భక్తులతో నిలబడాల్సి ఉంటుంది. ఆయనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ సార్ అని సంబోధించాల్సి ఉంటుంది. అంబటి రాంబాబు వంటి నేతలు జగన్ రాజకీయాల్లోకి రాకముందే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇటీవల అంబటి ఇంటిపై దాడి జరిగినప్పుడు జగన్ ఫోన్ చేస్తే, ఆ సీనియర్ నేత అత్యంత వినయంగా సార్ సా ‘ అని మాట్లాడటం గమనార్హం. కేవలం అంబటి మాత్రమే కాదు, వైసీపీలోని చాలా మంది సీనియర్లు జగన్ వద్ద ఒక అనుచరుడిలాగే వ్యవహరించాల్సి వస్తోంది. సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకోవడం పక్కన పెట్టి, వారినే శాసించే స్థితిలో జగన్ ఉండటం వల్ల పార్టీలో అంతర్గతంగా అనుభవం కలిగిన మేధావుల సలహాలకు తావులేకుండా పోయింది.
నారా లోకేష్ – నేర్చుకునే తత్వం
జగన్ శైలికి భిన్నంగా నారా లోకేష్ రాజకీయాల్లో సరికొత్త సంస్కృతిని ప్రదర్శిస్తున్నారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, లోకేష్ మాత్రం సీనియర్ల పట్ల అత్యంత మర్యాదపూర్వకంగా మెలుగుతున్నారు. రాజకీయాల్లో సీనియర్ నేతలే అసలైన గ్రంథాలయాలని నమ్మే లోకేష్, వారి నుంచి అనుభవాన్ని సేకరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. పెద్దల పట్ల ఆయన చూపే గౌరవం కేవలం ప్రోటోకాల్ కోసం కాకుండా, సహజ సిద్ధమైన మర్యాదగా కనిపిస్తోంది. అసెంబ్లీలో సభ ముగిసిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడి పట్ల లోకేష్ వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. స్పీకర్ వద్దని వారించినప్పటికీ, స్వయంగా ఆయన కారు వరకు వెళ్లి మర్యాదపూర్వకంగా సాగనంపారు. ఒక మంత్రిగా ఉండి కూడా తనకంటే సీనియర్ అయిన స్పీకర్ పట్ల ఆ స్థాయి గౌరవం చూపడం లోకేష్ సంస్కారానికి నిదర్శనం. అలాగే సీనియర్ నేత గౌతు శివాజీని ఆహ్వానించి, స్వయంగా కారు దిగుతున్నప్పుడే స్వాగతం పలికి, వారితో కలిసి భోజనం చేస్తూ రాజకీయ మెళకువలు అడిగి తెలుసుకోవడం ఆయన వినయానికి ప్రతీక.
రాజకీయాల్లో వినయం ముఖ్యం
రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు, కానీ సంపాదించుకున్న గౌరవం శాశ్వతం. జగన్ రెడ్డి తన చుట్టూ ఉన్న సీనియర్లను కేవలం తన ఆదేశాలను పాటించే వారిగా చూస్తే, లోకేష్ మాత్రం వారిని తన మార్గదర్శకులుగా చూస్తున్నారు. జగన్ శైలిలో అధికార గర్వం కనిపిస్తే, లోకేష్ శైలిలో సంప్రదాయ విలువలు, నేర్చుకోవాలనే తపన కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నాయకుడు తన పక్కన ఉండేవారిని ఎంత గౌరవిస్తాడో, ప్రజలు కూడా అతడిని అంతే గౌరవిస్తారన్న సత్యాన్ని ఈ ఇద్దరు నేతల ప్రవర్తన గుర్తుచేస్తోంది.