జగన్ రెడ్డి ఎప్పుడూ ఎవర్నీ నిరాశపరచరు. కావాల్సింత కామెడీ, ట్రోల్ మెటీరియల్ ఇస్తారు. ఈ రోజు రాజధానిపై పెట్టిన ప్రెస్మీట్లోనూ అంచనాలకు మించి కంటెంట్ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఆయన సూచించిన కొత్త రాజధాని హైలెట్ . మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు వరకూ కొత్త రాజధానిని ప్రకటించాలని.. దానికి MAVIGUN అని పేరు పెట్టాలని ఆయన అన్నారు. దీనికి మావిగన్ అని పేరు ఎందుకంటే.. మచిలీపట్నంలో మొదటి రెండు అక్షరాలు.. విజయవాడలోని మొదటి రెండు అక్షరాలు, గుంటూరులోని మొదటి మూడక్షరాలతో ఈ పేరు పెట్టాలట.
జగన్ రెడ్డి మాటలు విని మీడియా సమావేశంలో ఉన్న వారికి ఎలా ఉందో కానీ ఆయన మాటల్ని లైవ్ లో చూస్తున్న వారికి మాత్రం తాము కరెక్ట్ గానే విన్నామా అని ఆశ్చర్యపోయారు. జగన్ రెడ్డి ఇప్పటికి రాజధానిపై ఎన్ని మాటలు చెప్పారో అందరూ చూశారు. ఇప్పుడు కొత్తగా తన పేరు స్ఫురించేలా మావిగన్ అంటున్నారు. అసలు రాజధాని అంటే జగన్ రెడ్డి ఏమనుకుంటున్నాడో కానీ విభజిత ఏపీతో ఓ ఆట ఆడుకుంటున్నాడు. అధికారం పోగానే.. ఆయన బెంగళూరు ప్యాలెస్ కు మకాం మార్చారు. వారానికి రెండురోజులు వచ్చి ఏపీలో ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారు.
ఆయన తీరుతో వైసీపీ నేతలు కూడా ఇదేం పిచ్చి అనుకోకుండా ఉండలేకపోతున్నారు. రాజధానిపై ఓ ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న ఆయన తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటారన్న భావన కూడాలేకుండా పోయింది.ఓ వైపు పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరుగుతూంటే.. జగన్ రెడ్డి వేసిన ఈ డ్రామాలు చూసి.. జనం నవ్వుకుంటున్నారు.


